ఫ్లైట్ నుంచి మ‌హిళా ప్రొఫెస‌ర్‌ ను ఈడ్చికెళ్లారు

Update: 2017-09-28 08:20 GMT
ఒక మ‌హిళ ప‌ట్ల అమెరిక‌న్ పోలీసులు.. విమాన సిబ్బంది వ్య‌వ‌హ‌రించిన తీరుపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక మ‌హిళా ప్రొఫెస‌ర్ విష‌యంలో విమాన సిబ్బంది అనుస‌రించిన వైనం ఒక ఎత్తు అయితే.. వారికి స్థానిక పోలీసులు ద‌న్నుగా నిలిచిన వైనం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

విమానంలో చోటు చేసుకున్న ఈ దారుణాన్ని హాలీవుడ్ సినీ నిర్మాత బిల్ డుమాస్ సెల్ ఫోన్లో స్వ‌యంగా చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఒక‌టి బాల్టిమోర్ నుంచి లాస్ ఏంజిల్స్‌కు వెళుతోంది. అయితే.. ఈ విమానంలో రెండు కుక్క‌లు కూడా బోర్డు అయి ఉన్నాయి. త‌న‌కు కుక్క‌లంటే అలెర్జీ అని.. కుక్క‌ల కార‌ణంగా త‌న‌కు తీవ్ర‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదురయ్యే అవ‌కాశం ఉంద‌ని.. వాటిని దింపాల‌ని విమాన సిబ్బందిని కోరారు.

అయితే.. అందుకు కుద‌ర‌ద‌న్న విమాన సిబ్బంది.. ఆమెనే దిగిపోవాల‌న్నారు. అయితే.. అందుకు ఆమె నో చెప్పారు. తాను వెళ్ల‌టానికి అదే చివ‌రి విమానం అని.. తాను దిగ‌టం సాధ్యం కాద‌ని స‌ద‌రు మ‌హిళ తేల్చి చెప్పారు.

ఈ విష‌యం ఇలా సాగుతూ.. వాగ్వాదం పెరిగింది.  ప్రయాణికురాలిని బ‌ల‌వంతంగా విమానం నుంచి దింపేందుకు స్థానిక పోలీసుల స‌హ‌కారాన్ని విమాన సిబ్బంది కోరారు. విమానంలోకి వ‌చ్చిన పోలీసులు ఆమెను అత్యంత దారుణంగా విమానం నుంచి బ‌య‌ట‌కు ఈడ్చిపారేశారు. ఆమె కింద‌కు దిగేందుకు నిరాక‌రించ‌టంతో ఒక పోలీసు అధికారి ఆమె వీపు వెనుక నుంచి ముందుకు చేతులు పెట్టి సీట్లో నుంచి కింద‌కు లాగ‌గా.. మ‌రో వ్య‌క్తి ముందు కాళ్ల‌ను ప‌ట్టుకొని మ‌హిళ అని చూడ‌కుండా ఈడ్చుకెళ్లారు. కొద్ది నెల‌ల క్రితం చికాగోలో యునైటెడ్ ఎక్స్ ప్రెస్ ఎయిర్ లైన్స్ విమానంలోనూ ఇదే త‌ర‌హా ఘ‌ట‌న జ‌రిగి.. పెను వివాద‌మైంది.

తాను మ‌హిళా ప్రొఫెస‌ర్ ను అని.. త‌న ప‌ట్ల ఇంత అవ‌మాన‌క‌రంగా వ్య‌వ‌హ‌రిస్తారా? అంటూ ఆమె వాపోవ‌టం వీడియోలో క‌నిపించింది. త‌న తండ్రికి స‌ర్జ‌రీ ఉంద‌ని.. తాను త‌ప్ప‌నిస‌రిగా వెళ్లాల్సి ఉంద‌ని ఆమె ప్రాధేయ‌ప‌డ‌టం వీడియోలో  క‌నిపించింది. త‌న ఫ్యాంటు కూడా ఊడిపోతుంద‌ని. తాను న‌డుస్తాన‌ని చెప్పినా విన‌కుండా ఆమెను ఈడ్చుకెళ్లిన వైనానికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. దీంతో స్పందించిన సౌత్ వెస్ట్ బాధితురాలికి సారీ చెప్పింది. ప్ర‌యాణికురాలిని విమానం నుంచి కింద‌కు దించ‌టానికి పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు బాధాక‌ర‌మ‌ని.. ఆమె త‌న ఆరోగ్య స‌మ‌స్యకు సంబంధించిన మెడిక‌ల్ స‌ర్టిఫికేట్లు చూపించి ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయాన్ని విమాన‌యాన సంస్థ పేర్కొంది.ఇదిలా ఉంటే.. ఒక మ‌హిళా ప్రొఫెస‌ర్ ప‌ట్ల ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తారా? అంటూ నెటిజ‌న్లు పెద్ద ఎత్తున మండిప‌డుతున్నారు.

Full View
Tags:    

Similar News