కోడెల ఆత్మహత్య.. కాల్ డేటా కీలకం.!

Update: 2019-09-22 08:04 GMT
కోడెల ఆత్మహత్య వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. కోడెల ఆత్మహత్య తర్వాత ఆయన వాడే స్మార్ట్ ఫోన్ కనిపించకపోవడం కూడా అనుమానాలకు తావిచ్చింది. దీంతో హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీసులు ప్రధానంగా కోడెల ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు. ఆయన వాడిన స్మార్ట్ ఫోన్ కాల్స్ కీలకంగా భావిస్తున్నారు. ఆయన చివరి గంట ఎవరితో మాట్లాడారనే విషయంపై లోతైన దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిసింది.

కోడెల ఆత్మహత్యకు ముందు గంట వ్యవధిలో 10-12 మందితో ఫోన్ లో మాట్లాడినట్టు ఆయన కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. చనిపోవడానికి గంట ముందు ఖచ్చితంగా ఆయన తన ఆత్మహత్యకు గల కారణాలపై చెప్పి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

అందుకే తాజాగా కాల్ డేటా సేకరించిన పోలీసులు కోడెల ఫోన్ లో మాట్లాడిన వారిని పిలిచి విచారిస్తున్నట్టు తెలిసింది. ఇక కోడెల నివాసంపై కూడా కన్నేసిన పోలీసులు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేసి విచారణ జరుపుతున్నారు.

కోడెల కుమారుడితోపాటు కుటుంబ సభ్యులను, ఇంటి పనిమనుషులను ఇతరులను కూడా విచారిస్తున్నారు. ఇక తాజాగా కోడెల ఆత్మహత్యకు ఆయన కుమారుడు శివరామ్ కారణమని ఆరోపించిన కోడెల మేనల్లుడు సాయిబాబును కూడా విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కోడెల మృతిపై సీబీఐ విచారణ చేయాలని హైకోర్టులో పిటీషన్ వేసిన అనిల్ కుమార్ ను కూడా పోలీసులు విచారించినట్టు తెలిసింది. మొత్తంగా కోడెల ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషించే పనిలో ఇప్పుడు పోలీసులు బిజీగా ఉన్నట్టు తెలిసింది.


Tags:    

Similar News