324 నిందితులు..69 కేసులు..తుని లెక్క తేల్చారు

Update: 2017-07-14 04:59 GMT
గీత ఏడాది జ‌న‌వ‌రిలోఏపీలో చోటు చేసుకున్న తుని విధ్వంసానికి సంబంధించిన లెక్క తేల్చారు. కాపుల్ని బీసీల్లో చేరుస్తామంటూ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీ అధికార ప‌క్షం ఇచ్చిన హామీ అమ‌లులో చోటు చేసుకుంటున్న జాప్యం నేప‌థ్యంలో తునిలో కాపు గ‌ర్జ‌న పేరిట భారీ బ‌హిరంగ‌ స‌భ‌ను నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున ఆందోళ‌న జ‌ర‌గ‌టం.. నిర‌స‌న‌ల్లో భాగంగా ర‌త్నాచ‌ల్ ఎక్స్ ప్రెస్‌ ను త‌గ‌ల‌బెట్ట‌టం మొద‌లు.. తుని ప‌ట్ట‌ణంలో విప‌రీత ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా తుని ప‌ట్ట‌ణంలో పెద్ద ఎత్తున విధ్వంసం చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన కేసులో ఛార్జిషీట్ దాఖ‌లుకు రంగం సిద్ధం చేశారు. కాకినాడ సీఐడీ కోర్టులో ఛార్జి షీట్ల‌ను దాఖ‌లు చేయ‌నున్నారు. పూర్తి ఆధారాల‌తో తుని విధ్వంసంలో 324 మంది నిందితులు ఉన్న‌ట్లుగా అధికారులు తేల్చారు. మొత్తం 69 కేసుల్లో వేర్వేరు చార్జిషీట్ల‌ను దాఖ‌లు చేయ‌నున్నారు. విధ్వంసానికి మాజీ మంత్రి.. కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కార‌కుడిగా అధికారులు తేల్చారు.

ఆయ‌న రెచ్చ‌గొట్ట‌టం వ‌ల్లే నిర‌స‌న‌కారులు హింస‌కు పాల్ప‌డిన‌ట్లుగా సీఐడీ పేర్కొంది. ఎక్కువ కేసుల్లో ముద్ర‌గ‌డ‌నే ప్ర‌ధాన నిందితుడిగా పేర్కొన‌టం గ‌మ‌నార్హం. గ‌త ఏడాది జ‌న‌వ‌రి 31న జ‌రిగిన తుని విధ్వంసానికి సంబంధించిన ఛార్జిషీట్ ను అధికారులు తాజాగా దాఖ‌లు చేయ‌టంపైనా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఓప‌క్క పాద‌యాత్ర‌కు ముద్ర‌గ‌డ సిద్ధ‌మ‌వుతున్న వేళ‌.. ఛార్జిషీట్ దాఖ‌లు చేస్తుండ‌టం.. ఇందులో ఎక్కువ కేసుల్లో ముద్ర‌గ‌డ ప్ర‌ధాన నిందితుడిగా పేర్కొన‌టంపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News