శిరీష నిందితుల్ని రాత్రంతా అలా తిప్పారా?

Update: 2017-06-28 08:09 GMT
తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారిన బ్యూటీషియ‌న్ శిరీష మృతి కేసులో నిందితుల‌ను మంగ‌ళ‌వారం రాత్రంతా పోలీసులు ప‌లు ప్రాంతాల‌కు తిప్ప‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. శిరీష మృతి కేసులో నిందితులుగా ఉన్న రాజీవ్‌.. శ్రవ‌ణ్ ల‌ను విచార‌ణ కోసం పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకోవ‌టం తెలిసిందే.

ఇరువురిని వేర్వేరుగా ప్ర‌శ్నించిన పోలీసులు మంగ‌ళ‌వారం రాత్రి మాత్రం వారిద్ద‌రిని ప‌లు ప్రాంతాల‌కు తీసుకెళ్ల‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీస్తోంది. మంగ‌ళ‌వారం రాత్రి మొద‌లుకొని.. బుధ‌వారం తెల్ల‌వారుజాము వ‌ర‌కూ వారిద్ద‌రిని పోలీసులు వివిధ ప్రాంతాల్లో తిప్పారు. ఈ సంద‌ర్భంగా.. ఆ వివ‌రాలేవీ మీడియాకు తెలీకుండా ఉండేలా పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం గ‌మ‌నార్హం.

మంగ‌ళ‌వారం అర్ద‌రాత్రి 1.20 గంట‌ల వేళ‌లో రాజీవ్‌.. శ్ర‌వ‌ణ్ ల‌ను ఉస్మానియా ఆసుప‌త్రికి తీసుకెళ్లిన పోలీసులు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అనంత‌రం అక్క‌డ  నుంచి కుకునూరుప‌ల్లికి తీసుకెళ్లారు. తెల్ల‌వారుజామున 3.30 గంట‌ల ప్రాంతంలో కుకునూరు ప‌ల్లికి తీసుకెళ్లిన పోలీసులు.. మీడియా అక్క‌డ ఉండ‌టంతో పోలీస్‌ స్టేష‌న్‌ కు తీసుకెళ్ల‌కుండా సిద్దిపేట వైపు వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు.

కుకునూరుప‌ల్లి రోడ్ల మీద దాదాపు 45 నిమిషాల పాటు తిప్పిన పోలీసులు తెల్ల‌వారుజామున 4.15 గంట‌ల స‌మ‌యంలో హైద‌రాబాద్‌ కు తీసుకెళ్లారు. అనంత‌రం ఉద‌యం 5.30 గంట‌ల వేళ‌లో బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌ కు తీసుకొచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. ఎందుకిలా పోలీసులు చేశార‌న్న సందేహానికి పోలీసు వ‌ర్గాల చెబుతున్న స‌మాచారం ప్ర‌కారం నేరం జ‌రిగిన తీరును మ‌రోసారి స‌రి చూసుకోవ‌టం.. కేసును రీ క‌న్ స్ట్ర‌క్ష‌న్ చేసేందుకే పోలీసులు అలా చేసి ఉంటార‌ని చెబుతున్నారు. నిందితులు చెప్పిన మాట‌ల్ని మ‌రోసారి స‌రి పోల్చి చూసుకునేందుకే పోలీసులు వెళ్లి ఉండొచ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్ర‌కారం బుధ‌వారంతో నిందితుల క‌స్ట‌డీ ముగుస్తుంది. ఈ లోపు త‌మ‌కు అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని సేక‌రించేందుకు నేరం జ‌రిగిన రోజున ఏం జ‌రిగింద‌న్న‌ది తెలుసుకునేందుకు రాత్రి వేళ‌లో కుకునూరుప‌ల్లి వెళ్లి ఉంటార‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా నిందితులు ఇద్ద‌రిని నాంప‌ల్లి కోర్టులో హాజ‌రు ప‌ర్చారు. త‌మ క‌స్ట‌డీ ముగిసిన‌ట్లుగా పోలీసులు కోర్టుకు చెప్పారు. అనంత‌రం వారిని చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించేందుకు ఏర్పాట్లు జ‌ర‌గ‌నున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News