వైసీపీ ఎంపీ పేరుతో వసూళ్లు

Update: 2016-03-04 06:41 GMT
 కడప ఎంపి అవినాష్‌ రెడ్డి పేరు ఉపయోగించుకుని డబ్బు వసూలు చేయాలని ప్రయత్నించి దొరికిపోయాడో వ్యక్తి. వైసీపీ నేతల వద్దే ఇలా వసూళ్లకు ప్రయత్నించడంతో ఆయన బండారం బయటపడింది.

కృష్ఝాజిల్లా నందిగామ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ జగన్మోహనరావుకు బుధవారం ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి తనను తాను కడప ఎంపీ అవినాష్ రెడ్డిగా పరిచయం చేసుకుంటూ.... అన్న (జగన్) ఒక పని చెప్పారు, మా కుర్రాడు ఒకరు మీ వద్దకు వస్తాడు, రూ.4 లక్షలు ఇచ్చి పంపమని ఆదేశించాడు. అయితే ఫోన్ చేసిన వ్యక్తి మాట తీరుపై అనుమానం కల్గిన డాక్టర్ జగన్మోహనరావు ఈ విషయాన్ని తన సోదరుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శి  అరుణ్ - స్థానిక నాయకులకు తెలియజేశాడు. ఆలోగా మళ్లీ సదరు వ్యక్తి ఫోన్ చేసి ప్రవీణ్ అనే కుర్రవాడు కంచికచర్లలో కలుస్తారని డాక్టర్ జగన్మోహనరావుకు తెలియజేయగా అతన్ని కలిసేందుకు వైసీపీ నేతలను పంపించారు జగన్మోహనరావు. 

అయితే ఈలోగా జగన్మోహనరావు సోదరుడు అరుణ్.. అవినాష్ రెడ్డిని సంప్రదించగా తాను ఎవరినీ పంపించలేదని ఆయన చెప్పారు.  దీంతో కంచికచర్లలో ప్రవీణ్ ను కలిసిన వైకాపా నేతలు అతన్ని కారులో ఎక్కించుకొని వచ్చి పోలీస్ స్టేషన్‌ లో అప్పగించారు. విచారణలో.. సునీల్ అనే వ్యక్తి ఇలా అవినాష్ రెడ్డి పేరుతో ఫోన్ చేసి వసూళ్లకు ప్రయత్నించినట్లు తేలింది.
Tags:    

Similar News