నిజాంపేట బాధితురాలి వార్తలు వేయకూడదని తేల్చిన పోలీసులు

Update: 2019-12-02 05:22 GMT
మితిమీరిన అతితో మొదటికే మోసం వస్తుందన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే అర్థం కాక మానదు. సంచలన అంశాలకు సంబంధించిన వార్తల విషయంలో విచక్షణ మరిచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మీడియా తీరుపై పోలీసులు ఇప్పుడు సూచనల పేరుతో ముకుతాడు వేస్తున్నారు.

నిజాంపేటకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి ఉంటే.. అక్కతో పెళ్లి సంబంధం గురించి మాట్లాడటానికి వచ్చిన వ్యక్తి.. చెల్లెలిపై అత్యాచార యత్నానికి సంబంధించి చాలా మీడియా సంస్థలు అత్యాచారంగా పేర్కొని భారీ తప్పు చేశాయి. జరిగింది ఒకటైతే.. ప్రచారం మరొకటి జరగటం.. వార్తల రూపంలో వస్తున్న సమాచారం బాధితురాలికి తలనొప్పిగా మారింది.

ఈ నేపథ్యంలో సదరు ఉదంతం గురించి ఎక్కడా వార్తలు వద్దంటూ పోలీసులు పేర్కొంటున్నారు. ఈ నేరం విషయంలో ఉన్న సున్నితత్త్వం కారణంగా ఈ వార్తల్ని ప్రచురించకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విజయవంతమైనట్లుగా తెలుస్తోంది.

దుర్మార్గంగా వ్యవహరించిన సదరు నిందితుడ్ని కర్ణాటకలోని గుల్బరాలో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అతడ్ని అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. అయితే.. ఈ తరహా నేరాల విషయంలో సున్నితమైన రీతిలో.. బాధితులకు ఇబ్బందులు కలగకుండా వార్తలు రాయాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది. లేనిపక్షంలో సున్నితత్త్వం పేరుతో పోలీసుల సూచనలు అంతకంతకూ పెరిగితే.. అసలు వార్తలే ఇవ్వలేని పరిస్థితి ఉందంటున్నారు. సంచలన వార్తల విషయంలో సమాచారాన్ని అందించే విషయంలో మీడియా సంస్థలు సంయమనం పాటించని పక్షంలో మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తించాల్సిన సమయం అసన్నమైందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News