ఉద్యోగ నేతల ఇళ్ళ‌కు పోలీస్ పహారా...? అసలు ఏం జరుగుతోంది... ?

Update: 2022-02-10 02:30 GMT
కొత్త పీయార్సీ కాదు కానీ వ్యవహారం ఇపుడు అటూ ఇటూ తిరిగి మరీ భౌతిక దాడుల దాకా వెళ్తోందా. ఇది నిజమా. అలా అయితే దీని వెనక ఎవరు ఉన్నారు. ఉద్యోగ సంఘ నాయకులు దీని మీద చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం హాట్ హాట్ గా ఉన్నాయి. ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు కే ఆర్ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ  తమ మీద కుట్ర ఏదో జరుగుతోందని  సంచలన ఆరోపణలు చేశారు.

తమ మీద కొందరు దాడి చేస్తారని పోలీసుల వద్ద సమాచారం ఉండబట్టే తమ ఇళ్ళ వద్ద పోలీసులతో కాపలా ప్రభుత్వం పెట్టించిదని ఆయన చెప్పడం విశేషం. ఉపాధ్యాయ సంఘాల నేతల ముసుగులో కొన్ని రాజకీయ పార్టీల నాయకులే దాడి చేయవచ్చు అన్న సమాచారమైనా  దీనికి సంబంధించిన కుట్ర ఏదైనా పోలీసుల వద్ద ఉండవచ్చు అని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ కారణంగానే తమ ఇళ్ల వద్ద పోలీసులు కాపలా పెట్టినట్లుగా అభిప్రాయపడుతున్నామని అన్నారు. అయితే తాము ఎవరికీ భయపడమని, తమ మీద ఎవరైనా దాడులు చేస్తే కాపాడుకోవడానికి పోలీసులు అవసరం లేదని, తమ ఉద్యోగులే కాపాడుతారని కూడా ఆయన చెప్పడం విశేషం. పోలీసుల కాపలా తమకు ఎందుకని ప్రశ్నించడం గమనార్హం.

తాము నిజాయతీగా పనిచేశామని ఆయన చెప్పారు. కొందరు   ఆరోపించినట్లుగా తాము ఎలాంటి లాలూచీ ప్రభుత్వంతో పడలేదని, ఇంత పెద్ద ఉద్యమంలో అలా చేయడం సాధ్యపడుతుందా అని ఆయన ప్రశ్నించారు. తాము ఎన్నో డిమాండ్లను సాధించామని ఆయన చెప్పారు.

ఇక ఉపాధ్యాయ ఉద్యమంలో బయట శక్తులు ప్రవేశించాయని, వాటికి గుర్తించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేయడం విశేషం. మొత్తానికి ఆ నలుగురు కీలక నేతల  ఇళ్ల వద్ద పోలీసుల కాపలా మాత్రం ఇపుడు చర్చనీయాంశం అవుతోంది.
Tags:    

Similar News