జ‌నాలు చ‌స్తే.. ఈ ద‌రిద్ర రాజ‌కీయం ఏంది?

Update: 2015-07-14 09:29 GMT
ఏదైనా ఘోరం జ‌రిగిన‌ప్పుడు ఏం చేయాలి? త‌ప్పులు వెతుకుతూ.. తిట్టిపోయాలా? లేక‌.. త‌మ వంతు సాయంగా ఏం చేయ‌టానికైనా సిద్ధ‌మ‌ని చెప్పాలా? మాట‌ల్ని వ‌దిలేసి.. సాయం అందించే ప‌నిలో నిమ‌గ్నం కావాలా?
గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా రాజ‌మండ్రి మొద‌టి పుష్క‌ర ఘాట్‌లో చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో 27 మంది భ‌క్తులు మృత్యువాత ప‌డిన కొద్ది గంట‌లు కాక‌ముందే.. ద‌రిద్ర‌పు రాజ‌కీయం మొద‌లైంది. త‌ప్పు ఎవ‌రిది? ఎందుకింత ప్ర‌మాదం జ‌రిగింది? లాంటి అంశాల మీద దృష్టి పెట్టాల్సిందే. కానీ.. ఎప్పుడూ.. ప‌రిస్థితి ఒక కొలిక్కి వ‌చ్చిన త‌ర్వాత మాత్ర‌మే. బాధితులు శోక సంద్రంలో మునిగిపోయిన వేళ‌.. త‌ప్పు నీదే.. నీలాంటోడు మూలంగానే ఇంత‌మంది చ‌చ్చిపోయారు.. వెంట‌నే నీ ప‌ద‌వికి రాజీనామా  చేయ్‌.. అంత‌మంది చావుల‌కు బాధ్య‌త వ‌హించు లాంటి మాట‌ల‌తో ఏపీ ముఖ్య‌మంత్రిపై విరుచుకుప‌డ‌టం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం అయినా ఉంటుందా?

పుష్క‌రాలు లాంటి భారీ కార్య‌క్ర‌మంలో తొక్కిస‌లాట చోటు చేసుకొని.. ఇంత భారీగా భ‌క్తులు మృత్యువాత ప‌డ‌టం క‌చ్ఛితంగా చంద్ర‌బాబు స‌ర్కారు వైఫ‌ల్యంగానే భావించాలి. మ‌రో మాట‌కు తావు లేదు. కానీ.. మృతి చెందిన వారి ఆన‌వాళ్లు గుర్తించ‌టం కూడా పూర్తి కాక‌ముందే.. శ‌వాల మీద పేలాలు ఏరుకునేలా రాజ‌కీయ పార్టీలు ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా ప్ర‌భుత్వాన్ని దుమ్మెత్తిపోయ‌టం మీద‌నే దృష్టి పెట్టారు త‌ప్పించి.. ఇలాంటి సంద‌ర్భాల్లో త‌మ పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌ల్ని బృందాలుగా సిద్ధం చేసి.. బాధితుల‌కుసాయం అందించే అంశంపై దృష్టి సారించారా? అంటే అదీ క‌నిపించ‌దు.

రాజ‌కీయ స్వార్థం త‌ప్పించి.. బాధితుల‌కు సాయం అందించాల‌న్న ధోర‌ణి పార్టీల‌కు క‌నిపించ‌క‌పోవ‌టం ప్ర‌జ‌ల దుర‌దృష్టంగా చెప్పాలి. తీరిగ్గా కూర్చొని న‌ల‌గ‌ని చొక్కా వేసుకున్న చిరంజీవి.. చంద్ర‌బాబు ఆత్మ విమ‌ర్శ చేసుకోవాల‌ని.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని కోర‌తారుత‌ప్పించి.. త‌న ఫ్యాన్స్ ను కానీ.. కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు.. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ముమ్మ‌రంగా పాల్గొనాల‌ని.. బాధితుల‌కు సాయం చేసేందుకు క‌ద‌లాల‌న్న పిలుపు ఇవ్వ‌రు.

ఇక‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి.. జ్యోతుల నెహ్రు.. అంబ‌టి రాంబాబులు కావొచ్చు.. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి కానీ.. బాధితుల‌కు సాయం అందించాల‌న్న అంశంపై క‌న్నా.. చంద్ర‌బాబు ఏ యాంగిల్ లో తిట్టొచ్చు అన్న అంశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.
శ‌వాల మీద పేలాలు ఏరుకునే మాదిరి.. ఒక‌వైపు రాజ‌మండ్రి పుష్క‌ర ఘాట్ ద‌గ్గ‌ర బాధితులు గుండె త‌రుక్కుపోయేలా ఏడుస్తుంటే.. వారి కంట క‌న్నీరు తుడిచి.. వారికి మ‌నోధైర్యం అందించే క‌న్నా.. త‌ప్పు చంద్ర‌బాబుదే.. ఆయ‌న్ను అరెస్ట్ చేయాల‌ని.. ఆయ‌న‌పై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాల‌ని.. ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాలంటూ మాట్లాడ‌టం దేనికి నిద‌ర్శ‌నం.

నేత‌ల మాట‌లు చూస్తే.. భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో చ‌నిపోయార‌న్న బాధ కంటే  కూడా.. చంద్ర‌బాబును బాగా తిట్టేందుకు మంచి అవ‌కాశం క‌లిగింద‌న్న ఆత్రుత నేత‌ల మాటల్లో క‌నిపించ‌టం చూస్తే.. తెలుగోళ్ల‌దేం ఖ‌ర్మ అనుకోకుండా ఉండ‌లేని ప‌రిస్థితి.
Tags:    

Similar News