రాజకీయ నాయకులంటేనే... ఎదురుదాడికి, విమర్శలకు మారుపేరు. అయితే ఆ విమర్శల్లో కాస్త పద్దతి ఉండాలి. సీనియర్లుగా ఉన్న వారు..ఓర్పును ప్రదర్శించాలి. కానీ అలాంటివి కరువైపోతున్నాయి. ఎంత తిడితే అంత గొప్ప అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఎర్రగడ్డలోని చాతి ఆస్పత్రిని తరలించి సెక్రటేరియట్ నిర్మించేందుకు సిద్దమైన సీఎం కేసీఆర్ పై బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి దుమ్మెత్త్తిపోశారు. 'హైదరాబాద్‌లో కాలుష్యం పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చెస్ట్ ఆసుపత్రి అవసరం ఉంది. ఇక్కడ చెస్ట్ ఆసుపత్రి వద్దనే మూర్ఖుడు సీ బ్లాక్‌లో తప్ప ఎక్కడైనా ఉంటారా? కొత్త సెక్రటేరియట్ కోసం తరలిస్తున్న చెస్ట్ ఆసుపత్రి భవనం హెరిటేజ్ బిల్డింగ్. ఆనాలోచిత నిర్ణయాలకు సచివాలయంలోని సీ బ్లాకు నిలయంగా మారింది. మెంటలెక్కిన ప్రభుత్వం అంటే ఇదే' అని ధ్వజమెత్తారు. సచివాలయంలో కోసం ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రిని ఎర్రగడ్డ నుంచి తరలిస్తే ఉద్యమిస్తామని నాగం హెచ్చరించారు. చెస్ట్ ఆస్పత్రిని తరలించొద్దని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న రిలే దీక్షలకు మద్దతు పలికిన అనంతరం నాగం మాట్లాడారు.