వైద్యం అందక చస్తుంటే.. ఈ రాజకీయ రగడ అవసరమా?

Update: 2021-04-23 11:30 GMT
ఒక భవనంలో మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. వెంటనే ఏం చేస్తాం? ఫైర్ డిపార్ట్ మెంట్ కు ఫోన్ చేయటం.. వీలైనంతవరకు మంటల్ని ఆర్పేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తాం. అంతే తప్పించి.. అగ్ని ప్రమాదాలకు కారణం ఎవరు? ఎవరి తప్పు కారణంగా ఇంత భారీ మంటలు రేగాయి? అన్న ప్రశ్నలు వేస్తూ కాలం గడుపుతామా? ముందు మంటల్ని ఆర్పేద్దాం.. తర్వాత సంగతి చూద్దామనుకుంటామా?

ఈ ప్రశ్నలు ఎవరిని అడిగినా.. కారణం ఏమిటన్నది పక్కన పెట్టి.. మంటల్ని ఆర్పేందుకే ప్రయత్నం చేస్తాం. కరోనా వేళ.. రాజకీయ పార్టీల మధ్య రగత ఇందుకు భిన్నంగా ఉండటం దేనికి నిదర్శనం? జాతీయ స్థాయిలోనే కాదు.. తెలంగాణలోనూ ఇప్పుడు ఇలాంటి పరిస్థితే నెలకొంది. మీరు ఫెయిల్ అంటే మీరు ఫెయిల్ అంటూ కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల్ని నడిపిస్తున్న రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

కోవీషీల్డ్ ధరపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. ఒకే దేశం ఒకటే ట్యాక్స్ అన్నప్పుడు ఒకటే దేశం.. ఒకటే టీకా ధర అన్నది ఎందుకు లేదంటూ సూటిగా ప్రశ్నించారు. ఆక్సిజన్ కొరతకు కేంద్రం వైఖరే కారణమని స్పష్టం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కు జతగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి గళం విప్పారు. తాజా పరిస్థితి మీద సమీక్ష కూడా కేంద్రం చేయలేదని ఆయన మండిపడ్డారు.

తమ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్న టీఆర్ఎస్ నేతలపై తెలంగాణ బీజేపీనేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం కరోనాను పట్టించుకోకుండా వదిలేసిందని.. బీజేపీ ఎంపీ అర్వింగ్.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఉమ్మడిగా విరుచుకుపడ్డారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక సమీక్ష జరపలేదని వారు తప్పు పట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస అవసరాలు లేవని.. ప్రైవేటు ఆసుపత్రులు దారుణమైన దోపిడీకి తెర తీశాయని.. వాటిని నియంత్రించటంలో ఫెయిల్ అయ్యాయని మండిపడ్డారు.

కరోనా పరిస్థితులపై రాష్ట్రం సరైన సమాచారం ఇవ్వటం లేదని.. మరణాల్లోనూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నట్లుగా పేర్కొన్నారు. రెమిడెసివర్ లాంటి అత్యవసర మందుల వినియోగంపైనా మంత్రులు కేటీఆర్.. ఈటెల మాటలకు పొంతన లేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర వైఫల్యాన్ని కేంద్రం మీద నెట్టేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మొత్తానికి అటు కేంద్రం.. ఇటు రాష్ట్రం ఫెయిల్ అయిన తీరుకు భిన్నంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం గమనార్హం.



Tags:    

Similar News