పొంగులేటి.. ఇక తాడోపేడో!

Update: 2021-11-16 07:05 GMT
పార్టీకి విధేయుడిగా ఉన్న త‌గిన గుర్తింపు రాక‌పోతే ఎలా ఉంటుంది? గెలిచే అవ‌కాశం ఉన్న స్థానాన్ని పార్టీ కోసం త్యాగం చేసిన‌ప్ప‌టికీ అందుకు త‌గిన ప్ర‌తిఫ‌లం రాక‌పోతే ఎలా ఉంటుంది? ఎంత ఎదురు చూసినా ప‌ట్టించుకోకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ ప్ర‌శ్న‌ల‌ను టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస‌రెడ్డిని అడిగితే స‌రైన స‌మాధానాలు వ‌స్తాయ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కోసం ఆయ‌న అన్నీ చేస్తున్న‌ప్ప‌టికీ పార్టీలో ప్రాధాన్య‌త ల‌భించ‌డం లేద‌నే అసంతృప్తితో ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని టాక్‌. ఈ సారి మాత్రం ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్క‌క‌పోతే త‌న అనుచ‌ర గ‌ణం, అభిమానుల‌తో క‌లిసి పార్టీని వీడే ప్ర‌యత్నాలు చేస్తార‌ని తెలుస్తోంది.

ఖ‌మ్మంలో పొంగులేటికి మంచి ప‌ట్టుంది. అక్క‌డి ప్ర‌జ‌ల‌తో మంచి అనుబంధం ఉంది. 2012లో వైసీపీలో చేరి ఆయ‌న రాజ‌కీయ జీవితం ప్రారంభించారు. 2014లో ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత తొలిసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ పార్టీ త‌ర‌పున ఖ‌మ్మం ఎంపీగా గెల‌వ‌డ‌మే కాకుండా వైరా, పిన‌పాక‌, అశ్వ‌రావుపేట ఎమ్మెల్యేల‌ను గెలిపించుకున్నారు. తెలంగాణ సాధించిన ఉద్య‌మ పార్టీగా ఆ ఎన్నిక‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి వీచిన‌ప్ప‌టికీ ఖ‌మ్మంలో మాత్రం పొంగులేటి స‌త్తాచాటారు. అలాంటి నాయ‌కుడిని త‌మ పార్టీలో చేర్చుకుంటే ఖ‌మ్మంలో జెండా ఎగ‌రేయొచ్చ‌ని భావించిన కేసీఆర్‌.. పొంగులేటిని టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. వైసీపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా అప్పుడు ఉన్న పొంగులేటి ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. పొంగులేటిని పార్టీలో చేర్చుకునే స‌మ‌యంలో ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను త‌న‌దే బాధ్య‌త అని కేసీఆర్ చెప్పారు. కానీ ఆ త‌ర్వాత మాట త‌ప్పార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో పార్టీ నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరాటాలు, కుమ్ములాట‌ల కార‌ణంగా 2019 ఎన్నిక‌ల్లో త‌న సిట్టింగ్ స్థానాన్ని పార్టీ వేరేవాళ్ల‌కు కేటాయించినా పొంగులేటి సైలెంట్‌గానే ఉన్నారు. అధినేత కేసీఆర్‌పై న‌మ్మ‌కంతో ఆ త‌ర్వాత కూడా పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సింగ‌రేణి గుర్తింపు సంఘం ఎన్నిక‌లు, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థుల విజ‌యం కోసం ప‌నిచేశారు. అయిన‌ప్ప‌ట‌కీ ఆయ‌న‌కు పార్టీలో త‌గిన గుర్తింపు రాలేద‌న భావ‌న ఆయ‌న అనుచ‌రుల్లో ఉంది.

2020లో ఖాళీ అయిన రాజ్య‌స‌భ స్థానాల్లో ఒక‌దానికి ఆయ‌న్ని పంపిస్తార‌ని అనుకున్నా నిరాశే ఎదురైంది. దీంతో ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని ఆశ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు సామాజిక స‌మీక‌ర‌ణాలు జిల్లాలో ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న‌కు మ‌రోసారి మొండిచెయ్యే ఎదుర‌య్యే అవ‌కాశాలున్నాయి. ఇప్ప‌టికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల అభ్య‌ర్థుల జాబితాలో ఆయ‌న‌కు చోటు ద‌క్క‌లేదు. ఇక స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ కోటాపైనే ఆయ‌న ఆశ పెట్టుకున్నారు. ఈ సారి ఎమ్మెల్సీ కోసం అధినేత‌తో తాడోపేడో తేల్చుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ ఇప్పుడు కూడా ప‌ద‌వి రాక‌పోతే ఇక పార్టీని వీడ‌డ‌మే స‌రైంద‌ని ఆయ‌న అనుచ‌ర వర్గం అనుకుంటున్న‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News