ఇలాంటివి సీపీ సజ్జన్నార్ కే సాధ్యం బాస్.. ఏమంటారు?

Update: 2021-07-28 11:30 GMT
దేశం మొత్తమ్మీదా చాలామంది పోలీసు బాసులు.. ఉన్నతాధికారులు ఉండొచ్చు. కానీ.. సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీసీ సజ్జన్నార్ కాస్త భిన్నం. నిజాయితీ అధికారిగా పేరుతో పాటు.. సిబ్బందితో మానవీయ సంబంధాల్ని నెరపటమే కాదు..న్యాయం కోసం వచ్చే వారి కోసం ఆయన వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుందని చెబుతారు. అదే సమయంలో తనపై అధికారుల్నినొప్పించకుండా పని పూర్తి చేయటంలోనూ ఆయన దిట్ట. సైబరాబాద్ కు కమిషనర్ గా నియమించిన తర్వాత ఆయన చాలానే ప్రయోగాలు చేశారు. తన కమిషనరేట్ లో హిజ్రాలతో హెల్ప్ డెస్కు  ఏర్పాటు చేసి.. వారికి సాయంగా ఉండటమే కాదు.. కొందరు హిజ్రాల కారణంగా ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే ఈ డెస్కు వారు చూసుకునేలా ప్లాన్ చేశారు.

పోలీసు శాఖలో సీనియర్ అధికారి అయిన సజ్జన్నార్ చూసేందుకు సాఫ్ట్ గా కనిపించినా.. ఆయన తీరు మిగిలిన వారికి భిన్నం. ఏదైనా దారుణ నేరం జరిగితే.. ఆయనలోని నాలుగో సింహం నిద్ర లేస్తుందని చెబుతారు. ఇందుకు తగ్గట్లే ఆయన కెరీర్ లో కనిపించే ఎన్ కౌంటర్లను చూస్తే.. నేరస్తుల పాలిట ఆయన ఎంత కర్కశంగా ఉంటారో ఇట్టే అర్థమవుతుంది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులందరూ అనూహ్యంగా ఎన్ కౌంటర్ కావటం.. దేశ వ్యాప్తంగా దానిపై పండుగ వాతావరణం చోటు చేసుకోవటం తెలిసిందే.

ఈ ఉదంతంలో సజ్జన్నార్ కు వచ్చిన ఇమేజ్ మరే పోలీసు అధికారికి కానీ వచ్చి ఉంటే.. పరిస్థితి మరోలా ఉంటుందని చెబుతారు. భారీ ఇమేజ్ వచ్చినా ఆయనలో మాత్రం అహంకారం.. గర్వం లాంటివి కనిపించవని చెబుతారు. అలాంటి సజ్జన్నార్ తాజాగా దేశంలో మరే పోలీసు అధికారి చేయని ఒక కొత్త తరహా కార్యక్రమాన్ని చేపట్టారు. సాధారణంగా దొంగతనం కానీ బాధితులు పోగొట్టుకునే సొమ్ముల్ని రికవరీ చేయటం ఒక ఎత్తు. వాటిని బాధితులకు అందించటం మరో ఎత్తు. సాధారణంగా చోరీలు జరిగినప్పుడు సొమ్ములు రికవరీ చేసిన తర్వాత.. వాటిని సంబంధిత బాధితులకు ఇచ్చేందుకు చాలాకాలమే పట్టటంతోపాటు.. వాటిని తిరిగి ఇచ్చేందుకు ఉండే ప్రోసీజర్ తో చుక్కలుకనిపించే పరిస్థితి.

ఈ విషయాన్ని గుర్తించిన సజ్జన్నార్.. తాజాగా కొత్త తరహా కార్యక్రమాన్నిచేపట్టారు. రికవరీ చేసిన సొమ్ముల్ని.. న్యాయపరమైన అన్ని అడ్డంకుల్ని పూర్తి చేసి.. వాటిని బాధితులకు నేరుగా అందించేకు తన కమిషనరేట్ లోని గ్రౌండ్ లో ఒక కార్యక్రమాన్నినిర్వహించి.. అందరికి అందజేశారు. ఇలా దాదాపు రూ.1.5కోట్లకు సొమ్ముల్ని బాధితులకు నేరుగా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశారు. మొత్తం 176 మంది బాధితులకు తాము పోగొట్టుకున్నసొమ్ముల్ని రికవరీ చేసి ఇచ్చారు.

ఈ కార్యక్రమాన్నినిర్వహించటం కోసం సజ్జన్నార్ పెద్ద కసరత్తే చేశారు. తన కమిషనరేట్ పరిధిలోని 36 స్టేషన్లను ఏకం చేయటంతోపాటు.. కమిషనరేట్ పరిధిలోని మూడు జిల్లాల జడ్జిలతో మాట్లాడి.. కోర్టు ప్రాసెస్.. ఇతర ప్రోసీడింగ్స్ ను అన్ని పోలీసులే చూసుకునేలా చేశారు. కోర్టు అనుమతి తీసుకొని బాధితులకు వాటిని అప్పగించేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంతటి తలనొప్పి.. రిస్కు ఏ ఉన్నతాధికారి తీసుకుంటారు? ఇప్పటికే తమకున్న పనులతోనే సతమతమవుతున్నామని ఫిర్యాదు చేసే అధికారులకు భిన్నంగా.. సరికొత్త విధానాల్ని తీసుకొచ్చి.. బాధితులకు వీలైనంత సాయం చేసేందుకు ముందుకు రావటం సజ్జన్నార్ లాంటి వారికి మాత్రమే సాధ్యమేమో? ఇప్పుడు చెప్పండి.. ఇలాంటి కార్యక్రమం సజ్జన్నార్ కాకుండా ఇంకే పోలీసు అధికారి అయినా చేయగలరంటారా?
Tags:    

Similar News