ముద్రగడ కొత్త ఇన్నింగ్స్ మీద వైసీపీ ఆశలు
1989 ముందు టీడీపీకి ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.
సీనియర్ నేత మాజీ మంత్రి ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధిగా ముద్రగడ పద్మనాభం ఉన్నారు. ఆయన గతంలో రాజకీయాలను తనదైన శైలిలో డ్రైవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 1989 ముందు టీడీపీకి ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. దాంతో గోదారి రాజకీయం కూడా కాంగ్రెస్ వైపుగా డ్రైవ్ అయింది.
ఇక చూస్తే 1993లో తాను ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే కాపు రిజర్వేషన్లను కోరుతూ ఆయన పోరాటంతో టీడీపీకి రాజకీయంగా లాభించింది. అలా గోదావరి జిల్లా టీడీపీ వైపు టర్న్ అయింది. ఇక 2014 నుంచి 2019 మధ్యలో ముద్రగడ చేసిన కాపు రిజర్వేషన్ పోరాటం ఫలితంగా టీడీపీకి గోదావరి జిల్లాలలో ఇబ్బందిగా మారింది. అది చివరికి 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఉభయ గోదావరి జిల్లాలలో భారీ రాజకీయ లాభాన్ని తెచ్చిపెట్టింది.
అయితే 2024 ఎన్నికల్లో ముద్రగడ తన రాజకీయ ప్రభావాన్ని చూపించలేకపోయారు. దానికి కారణం ఆయన 2019 తరువాత కాపు ఉద్యమం నుంచి దూరం జరగడం వైసీపీ మీద సాఫ్ట్ కార్నర్ తో ఉండడం, ఎన్నికల ముందు జనసేన వైసీపీల మధ్య ఊగిసలాడడం వల్ల ఆయన ప్రభావం ఆ ఎన్నికల్లో కనిపించలేదని విశ్లేషణలు ఉన్నాయి.
అయితే ముద్రగడ ప్రభావాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదని అంటున్నారు. ఆయన పడి లేచిన కెరటం లాంటి వారని మళ్లీ ఎగిసిపడేలా ఉద్యమాలను నిర్మించగలరని గత చరిత్ర నిరూపించింది.అందుకే ఆయనను నమ్ముకుని గోదావరి జిల్లాలో వైసీపీ తన రాజకీయానికి పదును పెడుతోంది
అక్కడ ముద్రగడను మించిన రాజకీయ సామాజిక పెద్ద దిక్కు వైసీపీకి లేకపోవడం వల్ల కూడా ఆయన మీద ఆశలు పెంచుకుంటోంది. ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దాంతో ఆయన కుమారుడు గిరిని ప్రత్తిపాడు వైసీపీ ఇంచార్జి గా నియమించడం వెనక వైసీపీ వ్యూహం ఉందని అంటున్నారు
ముద్రగడ రానున్న నాలుగేళ్ల కాలంలో కూటమికి వ్యతిరేకంగా రాజకీయంగా సామాజికంగా ప్రజల మద్దతు కూడగడితే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో అది పెద్ద అడ్వాంటేజ్ అవుతుందని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే ముద్రగడకు అధిక ప్రాధ్యానత ఇస్తఒంది అని అంటున్నారు.
ఇక ముద్రగడ విషయానికి వస్తే ఇప్పటికే తన రాజకీయ జీవితంలో అనేక ఇన్నింగ్స్ ని చూసేసిన ఆయన సరికొత్త ఇన్నింగ్స్ ని ప్రారంభించాల్సి ఉంది. ఆయన కుమారుడు కూడా వైసీపీలో కీలకంగా ఉన్నందువల్ల ఆయన ఆ పార్టీ తరఫున మరింత గట్టిగా పనిచేయాల్సి ఉంది. దానికి ఆయన సంసిద్ధంగానే ఉన్నారని అంటున్నారు.
వైసీపీకి ముద్రగడ అవసరం ఇపుడు చాలా ఉంది. అలాగే ముద్రగడ మళ్ళీ తనను తాను నిరూపించుకునేందుకు యత్నిస్తారు అని అంటున్నారు. దాంతో రానున్న రోజులలో గోదావరి రాజకీయాల్లో ముద్రగడ ముద్ర బలంగానే ఉండేలా చూస్తున్నారు అని అంటున్నారు.
వైసీపీ ఆయనకు ఇస్తున్న విశేష ప్రాధాన్యతను కూడా ఆయన సరిగ్గా వినియోగించుకుంటే 2029 ఎన్నికల్లో ఆ పార్టీ నెగ్గితే ఆయనకు కూడా రాజకీయంగా మంచి అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇల పరస్పర ప్రయోజనాలతో ముద్రగడ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతాయని అంటున్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వెంట నడచిన కాపు సామాజికవర్గాన్ని వైసీపీ వైపు తిప్పే విధంగా ముద్రగడ తన చతురత చూపించాల్సి ఉందని అంటున్నారు.
ముక్కుసూటి రాజకీయలకు పెట్టింది పేరు అయిన ముద్రగడ వ్యూహాలలోనూ దిట్టగానే ఉన్నారు. తగిన సమయం సందర్భం చూసి ఆయన గోదాలోకి దిగితే మాత్రం అది ఉడుము పట్టుగానే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతానికి టీడీపీ కూటమి ప్రభుత్వం పనితీరుని పరిశీలిస్తున్న ముద్రగడ సరైన సమయంలో రంగంలోకి దిగుతారని అంటున్నారు. మరి ముద్రగడ ఏ విధంగా జనంలోకి వస్తారు, తన రాజకీయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు అన్న దాని మీదనే గోదావరి జిల్లాలలో వైసీపీ ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉందని అంటున్నారు.