రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా అంబేడ్క‌ర్ మ‌న‌మ‌డు?

Update: 2017-06-21 16:57 GMT
తెలివి ఏ ఒక్క‌రి సొంతం కాదు. కాలం.. ఖ‌ర్మం క‌లిసి వ‌స్తే కొన్నిసార్లు మామూలు వాళ్లు కూడా తోపులుగా మారిపోతారు. అదే కాలం చిన్న‌చూపు చూస్తే.. ఎంత తెలివైనోడు సైతం తెలివిత‌క్కువ స‌న్నాసిగా కనిపిస్తారు. తెలంగాణ రాష్ట్రం కోసం చేసి ఉద్య‌మం సంద‌ర్భంగా కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు.. అవ‌మానాలు.. క‌ష్టాలు ఎదుర్కొన్నారో చెప్ప‌లేం. ఒక‌ద‌శ‌లో ఆయ‌న‌పై తీవ్ర‌మైన వ్య‌తిరేకత వ్య‌క్త‌మైంది. మ‌రి.. అలాంటి కేసీఆర్‌.. ఈ రోజు ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

ఇదంతా ఎందుకంటే.. ప్ర‌ధాని మోడీ తెలివి గురించి.. వ్యూహ చ‌తుర‌త గురించి ఇప్పుడు గొప్ప‌గా చెప్పుకుంటున్నారు. అత‌గాడి గొప్ప‌త‌నాన్ని క‌థ‌లు క‌థ‌లుగా అభివ‌ర్ణిస్తున్నారు. రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా రామ్ నాథ్ కోవింద్ పేరును నిర్ణ‌యించిన వైనం ప‌లువురిని విస్మ‌యానికి గురి చేసింది.

ద‌ళితుడైన ఒక మేధావిని రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌టం ద్వారా విప‌క్షాల‌కు దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లోకి నెట్టారంటూ క‌మ‌ల‌నాథులు తెగ సంబ‌రప‌డిపోతున్నారు. ఏకాభిప్రాయంతో అంద‌రం క‌లిసి నిర్ణ‌యం తీసుకుందామ‌ని చెబుతూ.. త‌న‌దైన శైలిలో షాకిచ్చిన మోడీకి దిమ్మ తిరిగే పంచ్ ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో విప‌క్షాలు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

బీజేపీ ఖ‌రారు చేసిన అభ్య‌ర్థికి మించిన అభ్య‌ర్థిని తెర మీద‌కు తీసుకురావాల‌ని విప‌క్షాలు భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా రాజ్యాంగ నిర్మాత‌.. అంబేడ్క‌ర్ వార‌సుడ్ని దేశ అత్యున్న‌త ప‌ద‌వి కోసం తెర మీద‌కు తీసుకురావాల‌న్న ప్ర‌య‌త్నం జోరుగా సాగుతోంది.

అంబేడ్క‌ర్ మ‌న‌మ‌డు ప్ర‌కాశ్ అంబేడ్క‌ర్‌ను రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా నిల‌బెడితే గ‌ట్టి పోటీ ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని సీపీఎం భావిస్తోంది. ఇదే విష‌యాన్ని కాంగ్రెస్ తో స‌హా 18 పార్టీల‌కు చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ విష‌యం మీద కీల‌క నిర్ణ‌యాన్ని రేపు (గురువారం) తీసుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. మ‌హారాష్ట్రలోని భ‌రిప్ బ‌హుజ‌న్ మ‌హాసంఘ్  పార్టీని నేతృత్వం వ‌హిస్తున్న ప్ర‌కాశ్ అంబేడ్క‌ర్ గ‌తంలో అకోలా లోక్ స‌భ స్థానం నుంచి రెండుసార్లు గెలిచిన అనుభ‌వం ఉంది. ఒక‌సారి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నికైన ఆయ‌న వ‌య‌సు ప్ర‌స్తుతం 63 ఏళ్లు. సీపీఎం ఆలోచ‌న‌ల‌కు భిన్నంగా కాంగ్రెస్ ఆలోచ‌న‌లు ఉన్నాయ‌ని చెబుతున్నారు. త‌మ పార్టీకి చెందిన ద‌ళిత నేత‌ను రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దించాల‌ని భావిస్తున్న వేళ‌.. అంబేడ్క‌ర్ మ‌న‌మ‌డి పేరు తెర మీద‌కు రావ‌టంతో.. కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. రాష్ట్రప‌తి రేసులో అంబేడ్క‌ర్ మ‌న‌మ‌డు వ‌స్తే.. సీన్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుతుంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News