క‌ర్ణాట‌కలో స‌ర్కారు ప‌డిపోనుందా?

Update: 2018-12-06 15:33 GMT
కన్నడలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ముంచుకొచ్చినట్లుగా వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వం ఏర్పాటుకు నానా కష్టాలు పడి ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కుమారస్వామి ప్రభుత్వం కూలిపోనుందా? సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసే దిశగా బీజేపీ పావులు కదుపుతుందా? ఈ చ‌ర్చ తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ వ్యాఖ్య‌ల‌తో తెర‌మీద‌కు వ‌స్తోంది. కర్ణాటకలో ‘రాజకీయ ధమాకా’ జరుగబోతున్నదని ఆయ‌న‌ జోస్యం చెప్పారు. దీంతో హెచ్‌ డీ కుమారస్వామి సారథ్యంలోని జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వ పతనానికి కమలనాథులు మరో ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తున్నది.

జేడీఎస్‌ - కాంగ్రెస్‌ పార్టీల మధ్య గల అపవిత్ర పొత్తు త్వరలోనే విడిపోతుందని కేంద్ర‌మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ఓ టీవీ చానెల్‌ తో అన్నారు. ‘కర్ణాటకలో మాది అతిపెద్ద రాజకీయ పార్టీ. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏడు సీట్లు తక్కువయ్యాయి. అవకాశవాద రాజకీయాలకు మారు పేరైన కాంగ్రెస్‌ - జేడీఎస్‌ పార్టీలు రాష్ట్ర ప్రజలకు సుస్థిర ప్రభుత్వాన్ని అందివ్వలేవు’ అని వ్యాఖ్యానించారు. మరో కేంద్ర మంత్రి డీవీ సదానందగౌడ కూడా దాదాపు ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ‘కర్ణాటకలోని ప్రభుత్వం అంతర్గత విభేదాలతో కూలిపోతుంది. బెల్గావీ అసెంబ్లీ సమావేశాలు పూర్తవుతాయా? లేదా? అని మేం ఎదురు చూస్తున్నాం’ అని సదానందగౌడ తెలిపారు. రాష్ట్ర మంత్రి రమేశ్‌ జార్కిహోలీ బీజేపీలో చేరనున్నారని కర్ణాటక శాసనమండలిలో విపక్ష నేత - బీజేపీ నాయకుడు కోటా శ్రీనివాస్‌ పూజారి చేసిన వ్యాఖ్యతో కుమారస్వామి సర్కార్‌ మనుగడ ప్రశ్నార్థకం అన్న వదంతులు వ్యాపించాయి. ‘రమేశ్‌ జార్కిహోలీ ప్రస్తుత ప్రభుత్వానికి మానసికంగా దూరమయ్యారు. ఆయన తన బాధలేమిటో చెప్పారు. ఆయన ఎప్పుడు తమతో కలిసేందుకు వచ్చినా స్వాగతిస్తాం’ అని శ్రీనివాస్‌ పూజారి చెప్పారు. బుధవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశానికి జార్కిహోలీ గైర్హాజరు కావడంతో పూజారి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఇదిలాఉండ‌గా,  తమ ప్రభుత్వం పతనం అంచున ఉన్నదన్న బీజేపీ అంచనాలను సీఎం కుమారస్వామి కొట్టి పారేశారు. ‘బీజేపీలో ఆరు నెలలుగా ఈ భూకంపం సంభవిస్తూనే ఉన్నది. ఈ భూకంపం శబ్ధం మాత్రమే వినిపిస్తుంది. మా ప్రభుత్వం రాతి కట్టడమంత బలంగా ఉన్నది. ప్రభుత్వ పతనం అంశం ముగిసిపోయిన అధ్యాయం’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రి డీకే శివకుమార్‌ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ నేతలు ఆశాభంగానికి గురయ్యారు. వారు బేరసారాలను ప్రోత్సహిస్తున్నారని జవదేకర్‌ ప్రకటన సూచిస్తున్నది. ఈ ప్రభుత్వం పూర్తికాలం పని చేస్తుందని సీఎం కుమారస్వామికి హామీ ఇచ్చాం’ అని శివకుమార్‌ అన్నారు.



Tags:    

Similar News