బీజేపీ 'సింహా'నికి... ప్ర‌కాశ్ రాజ్ షాకిచ్చారే!

Update: 2017-11-23 16:15 GMT
ద‌క్షిణాది భాషా చిత్రాల న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఏం మాట్లాడినా, ఏం చేసినా కూడా సంచ‌ల‌నంగానే మారుతోంది. ఇప్పుడే కాదండోయ్‌... గతంలోనూ ప‌లు అంశాల‌పై ఆయ‌న చేసిన కామెంట్లు, నెర‌పిన వ్య‌వ‌హారాలు కూడా వైర‌ల్‌గానే మారాయ‌ని చెప్ప‌క తప్ప‌దు. రానున్న ఎన్నిక‌ల్లోగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తామంటూ ఇటీవ‌ల ప‌లువురు సినీ న‌టుల నుంచి వ‌రుస‌గా ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో సినీ న‌టుల రాజ‌కీయాల‌పైనా ప్ర‌కాశ్ రాజ్ చాలానే మాట్లాడేశాడు. అదే స‌మ‌యంలో పెద్ద నోట్ల ర‌ద్దు - జీఎస్టీ - దేశంలో పెరిగిపోతున్న హిందూ మ‌తోన్మాదం వంటి అంశాల‌పైనా ప్ర‌కాశ్ రాజ్ త‌న‌దైన శైలిలో కామెంట్లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పైనా ప‌లు సంద‌ర్భాల్లో ఘాటు కామెంట్లే చేశారు. దీంతో బీజేపీ నేత‌ల‌కు కూడా చిర్రెత్తుకొచ్చింది. ఏమాత్రం సంబంధం లేని విష‌యాల‌ను ఆస‌రా చేసుకుని నేరుగా ప్ర‌ధానినే టార్గెట్ చేస్తారా? అంటూ ప్ర‌కాశ్ రాజ్‌ పై బీజేపీ నేత‌లు ఘాటుగానే స్పందించారు.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల కర్ణాట‌క‌కు చెందిన బీజేపీ యువ ఎంపీ ప్ర‌తాప్ సింహా... ప్ర‌కాశ్ రాజ్‌పై ఘాటు కామెంట్లు చేశారు. ప్ర‌ధానిపై విరుచుకుప‌డిన ప్ర‌కాశ్ రాజ్‌కు బుద్ధి చెప్పాల‌న్న కోణంలో రంగంలోకి దిగిన ప్ర‌తాప్ సింహా... ఆ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూనే ప్ర‌కాశ్ రాజ్‌ ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తూ ఘాటు కామెంట్లు చేశారు. ఈ కామెంట్ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప్ర‌కాశ్ రాజ్‌... ఆ ఎంపీపై ఏకంగా ప‌రువు న‌ష్టం దావా వేసేశారు. ఈ  సంద‌ర్భంగా బెంగ‌ళూరులో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ప్ర‌కాశ్ రాజ్‌... బీజేపీ యువ ఎంపీపై నిప్పులు చెరిగారు. త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌తాప్ సింహా త‌న‌కు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాలని, లేని ప‌క్షంలో ఆయ‌న‌పై క్రిమిన‌ల్ కేసు పెట్ట‌డానికి కూడా వెనుకాడ‌బోన‌ని కూడా ప్ర‌కాశ్ రాజ్ హెచ్చ‌రించారు.

అయినా సింహాపై ప్ర‌కాశ్ రాజ్ ఏమన్నారంటే...  బీజేపీ ఎంపీ మీద పరువునష్టం దావా వేసింది డబ్బు కోసం కాదని, ఆయన బహిరంగంగా తనకు క్షమాపణ చెప్పాలనే అలా చేశానని ప్రకాష్ రాజ్ అన్నారు. తన వ్యక్తి గత విషయాలు సోషల్ మీడియాలో పెట్టిన సింహా వెంటనే బహిరంగంగా తనకు క్షమాపణలు చెప్పాలని, సోషల్ మీడియాలో పోస్టు చేసిన అని వ్యాఖ్యలు తొలగించాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో  సింహా మీద చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటానని ప్రకాష్ రాజ్ హెచ్చరించారు. ఎంపీ ప్రతాప్ సింహా ప్రజాసేవకుడు అయి ఉండి కనీసం మంచి మర్యాద లేకుండా తనను విమర్శించాడని, ఇది ప్రజలందరికీ అవమానం అని ఆయ‌న  ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

కొడుకు చనిపోయిన వెంటనే ఓ డ్యాన్సర్ తో తాను వెళ్లిపోయాను అంటారా?, ప్రధాని మోడీని విమర్శిస్తే ఇలా తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతారా? అని ప్ర‌శ్నాస్త్రాలు సంధించారు. మోడీని బీజేపీ నాయకుడిగా తాను విమర్శించలేదని, ఆయన ప్రధాని హోదాలో ఉన్నారనే తాను ప్రశ్నించానని ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. తన తల్లి ఒక ముస్లీం అని, తాను పాకిస్ధాన్ వెళ్లిపోవాలని - త‌న‌ వ్యక్తిత్వం గురించి అందరికీ తెలుసు...అంటూ సింహా తనను అవమానించారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. 10 రోజుల లోపు తనకు బీజేపీ ఎంపీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ హెచ్చరించారు.
Tags:    

Similar News