మాకు రక్షణ ఏదంటున్న ప్రకాష్ రాజ్

Update: 2017-11-23 07:37 GMT
గత కొంత కాలంగా సొసైటీలో సమస్యలపై కొంచెం గట్టిగానే స్పందిస్తున్నాడు ప్రకాష్ రాజ్. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యతో పాటు అనేక అంశాలపై ఆయన నిరసన స్వరం వినిపించారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన గట్టిగా మాట్లాడారు. ఇటీవలే ‘పద్మావతి’ సినిమా విషయంలో నడుస్తున్న నిరసనలు.. ప్రభుత్వ మౌనంపై ఆయన తీవ్రంగా స్పందించారు. తాజాగా ఆయన తమిళ నిర్మాత అశోక్ కుమార్ ఆత్మహత్యపై మాట్లాడారు. సినీ పరిశ్రమలో అంతర్గతంగా ఎలాంటి సమస్యలుంటాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ అని అన్నారు.

సినీ పరిశ్రమ చాలా గ్లామరస్ గా కనిపిస్తుందని.. కానీ ఇక్కడి వాళ్లకు అసలేమాత్రం రక్షణ అన్నది లేకుండా పోయిందని ప్రకాష్ రాజ్ అన్నాడు. తాము ప్రభుత్వానికి భారీగా పన్నులు కడతామని.. అయినప్పటికీ తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతూ లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. సినీ పరిశ్రమలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడానికి అశోక్ కుమార్ ఆత్మహత్యే ఉదాహరణ అని.. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని.. కానీ అవి వెలుగులోకి రాలేదని ప్రకాష్ రాజ్ అన్నాడు. ఇలాంటి నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దని ఆయన అభ్యర్థించాడు. సినీ పరిశ్రమకు సంబంధించిన జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం ఏమీ స్పందించకుండా మౌనంగా ఉండటం దారుణమని ప్రకాష్ రాజ్ అన్నాడు.

Tags:    

Similar News