బీహార్ ఎన్నికల్లో ఆ ఒక్కడు

Update: 2015-11-15 06:50 GMT
మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో దేశంలో బీజేపీ ప్రభంజనం సృష్టించడం... మోడీ ప్రధాని కావడం.. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పనిచేయడం.. అంతకుముందు గుజరాత్ తో వ్యతిరేకతలు, విమర్శలను ఎదుర్కొని మోడీ అప్రతిహత విజయాలు నమోదు చేయడం వెనుక ఉన్నది ఒకే ఒక్కడని.. ఆయనే తిరుగులేని వ్యూహకర్త అమిత్ షా అని అంతా భావించారు. అయితే... అదే అమిత్ షా వ్యూహ రచన చేసిన బీహార్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ బొక్కబోర్లా పడింది. మరి... అమిత్ షా వ్యూహాలు ఏమయ్యాయన్న ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేస్తోంది. దీనికి సమాధానం భాజపా వర్గాల నుంచి వినిపిస్తున్నది... అమిత్ షా ఖాతాలో పడిన విజయాలన్నీ ఆయన ఘనత వల్ల సాధ్యమైనవి కాదని.. అమిత్ షా టీంలోని ప్రశాంత్ కిశోర్ వల్ల సాధ్యమైనవని చెబుతున్నారు. బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ ను అమిత్ షాను వదులుకోవడంతో ఆయన్ను నితీశ్ అక్కున చేర్చుకోవడం... నితీశ్ కు తిరుగులేని విజయం దక్కడం జరిగిపోయాయి.

మోడీ ప్రధాని అయిన తరువాత, బీజేపీ పగ్గాలు తన చేతికి అందాక ఆ పార్టీ అద్యక్షుడు అమిత్ షా కొందరు ముఖ్య వ్యక్తులను పట్టించుకోవడం మానేశారు. వారిలో ప్రశాంత్ కిశోర్ ఒకరు. ప్రచార వ్యూహకర్తలలో నిపుణుడైన ప్రశాంత కిషోర్ ను బిజెపి పొగొట్టుకోవడానికి అమిత్ షా కారణమని ఆ పార్టీ సీనియర్లు అంటున్నారు.  గత సాధారణ ఎన్నికల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న నరేంద్ర మోడీకి ప్రచార వ్యూహాలను తయారు చేయడం,అమలు చేయడంలో ప్రశాంత కిషోర్ కీలక పాత్ర పోషించారు.అవి అనేకం ఫలించాయని అప్పట్లో భావించారు. మోడీ గెలుపులో అవి కూడా ప్రముఖ పాత్ర పోషించాయని అంతా ప్రశాంత కిషోర్ ను మెచ్చుకున్నారు. కాని ఆ తర్వాత ఏమైందో కాని, మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రశాంత్ దూరం అయ్యారు.దానికి కారణం షా అని కొందరి వాదనగా ఉంది.

బీజేపీకి దూరమవడంతో ఆయన నేరుగా బీహారు వెళ్లి నితీష్ కుమార్ ను కలిసి ఒక నివేదిక ఇచ్చారు. అది చూడగానే ఆయన ప్రశాంత్ ను తన టీంలో చేర్చుకున్నారు. అక్కడి నుంచి కథ మొదలైంది. కిషోర్ తన వద్ద ఉన్న 800 మంది టీంతో కలిసి బీహార్ ను దున్నేశాడు.  వ్యూహాత్మకంగా నితీష్ అనుకూల ప్రచారం చేపట్టాడు. నితీష్ ఎప్పుడు ఏ డైలాగ్ వదలాలో, ప్రధాని లేదా మరెవరైనా బిజెపి నేతలు విమర్శిస్తే ఎలాంటి సమాధానాలు ఇవ్వాలో అన్ని అప్పటికప్పుడు తయారు చేయడంలో కిషోర్ తిరుగులేకుండా వ్యవహరించారట. దాంతో అవన్ని ఉపయోగపడి నితీష్ ఘన విజయం సాధించారు. కిశోర్ లేని బీజేపీ బొక్కబోర్లా పడింది. దీంతో ఇప్పుడు బీజేపీ అయ్యో అని తల పట్టుకుంటోంది. ఇంకో విషయం ఏంటంటే కిశోర్ గురించి తెలుసుకున్న రాహుల్ గాందీ ఆయనను పిలిపించుకుని రెండు గంటల సేపు చర్చించారు.మమత బెనర్జీ తదితర నేతలు కూడా కిశోర్ సేవలను కోరుకుంటున్నారంటే ఆయనకు గిరాకి ఎంతగా పెరిగిందో ఊహించుకోవచ్చు.
Tags:    

Similar News