మ‌మ‌త‌తో డీల్.. పీకేపై వేటుకు నిర్ణ‌యం?

Update: 2019-06-07 14:30 GMT
ఆయ‌న ఓకే చెబితే గెలుపు గుమ్మంలోకి వ‌చ్చేసిన‌ట్లే అన్న పేరున్న రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ను ఆయ‌న నేతృత్వం వ‌హిస్తున్న జేడీయూ ప‌క్క‌న పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. బీజేపీ.. జేడీయూ త‌ర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల‌కు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తూ.. వారితో ప‌ని చేసిన ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కూ విజ‌యాలే న‌మోదు చేశారే కానీ ఎప్పుడూ నెగిటివ్ రిజ‌ల్ట్ తెచ్చుకున్న‌ది లేదు.

అలాంటి ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి దీదీతో చేతులు క‌ల‌ప‌టం తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు వీలుగా ఒప్పందం చేసుకున్నారు. ప‌శ్చిమ‌బెంగాల్ పై మోడీషాలు క‌న్నేయ‌టం.. ఎట్టి ప‌రిస్థితుల్లో బెంగాల్ కోట‌లో కాషాయ జెండాను ఎగుర‌వేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న నేప‌థ్యంలో.. త‌న‌ను గ‌ట్టెక్కించేందుకు ప్ర‌శాంత్ కిశోర్ కు మించిన స‌ల‌హాదారు మ‌రొక‌రు లేర‌న్న‌ట్లుగా దీదీ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

2014లో బీజేపీ విజ‌యంలోనూ.. 2015లో నితీశ్ గెలుపులోనూ.. తాజాగా 2019లో జ‌గ‌న్ విజ‌యంలోనూ ఆయ‌న కీల‌క‌భూమిక పోషించారు. దీంతో.. ప్ర‌శాంత్ ను త‌మ పార్టీ త‌ర‌ఫున పోటీ చేయాల‌ని దీదీ కోరుతున్నారు. ఇందులో భాగంగా ఆమె పీకేతో భేటీ అయ్యారు. వీరి స‌మావేశం దాదాపు రెండు గంట‌ల పాటు జ‌రిగింది.

ఇరువురి మ‌ధ్య ఒప్పందం కుదిరిన రోజు వ్య‌వ‌ధిలోనే ఆయ‌న నేతృత్వం వ‌హిస్తున్న జేడీయూ ఆయ‌న నిర్ణ‌యంపై గ‌రమ్ గ‌ర‌మ్ గా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఓవైపు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా బిజినెస్ చేస్తూ.. మ‌రోవైపు జేడీయూ ఉపాధ్యక్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌శాంత్ కిశోర్ ను తాజాగా పార్టీ ప‌క్క‌న పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు.

దీదీతో ఒప్పందం చేసుకోవ‌టాన్ని బిహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ సీరియ‌స్ గా తీస‌సుకున్న‌ట్లుగా తెలుస్తోంది. తాజా డీల్ నేప‌థ్యంలో ఆయ‌న్ను జేడీయూ నుంచి ఉద్వాస‌న ప‌లికేందుకు పార్టీ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా స‌మాచారం. ఈ అంశంపై జేడీయూ ప్రతినిధి అజ‌య్ అలోక్ స్పందిస్తూ.. జేడీయూ అధికార ప్ర‌తినిధిగా తాను చెబుతున్నాన‌ని.. పార్టీతో ఎలాంటి సంబంధం లేద‌ని.. ఎవ‌రికి వ్యూహ‌క‌ర్త‌గా ప‌ని చేయాల‌నేది ప్ర‌శాంత్ కిషోర్ వ్య‌క్తిగ‌త నిర్ణ‌య‌మ‌న్నారు.

దాంతో పార్టీకి ప‌నేముంది? ఇదే విష‌యాన్ని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కు చెప్పాను.. ప్ర‌శాంత్ మా పార్టీలో కార్య‌క‌ర్త‌గా చేరారు.. ఇప్పుడాయ‌న‌కు కార్య‌క‌ర్త‌గా ప‌ని చేయ‌టం ఇష్టం లేక‌పోతే మ‌న‌మేం చేయ‌గ‌ల‌మ‌ని సీఎం నితీశ్ అన్నార‌న్నారు. చూస్తుంటే.. దీదీతో చేతులు క‌ల‌ప‌టం నితీశ్ కు ఒక ప‌ట్టాన ఇష్టం లేద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.


Tags:    

Similar News