పార్టీలేదు.. ఇక‌, పాద‌యాత్రే... పీకే కొత్త వ్యూహం!!

Update: 2022-05-06 13:58 GMT
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) నిన్న మొన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌లో చేర‌తార‌నే ఊహాగానాల‌కు తెర‌దించారు. తాను కాంగ్రెస్‌లో చేరేది లేద‌ని తేల్చి చెప్పారు. దీంతో ఆయ‌న సొంత‌గా పార్టీ పెడుతున్నారంటూ.. మీడియాలో వార్త‌లు జోరందుకున్నా యి. సొంతంగానే పార్టీ పెట్టి.. కేంద్రంపై దృష్టి సారిస్తార‌ని.. పెద్ద ఎత్తున క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే.. అనూహ్యంగా ఆయ‌న పార్టీ కూడా పెట్ట‌డం లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అయితే.. ఇప్పుడు స‌రికొత్త‌గా ఆయ‌న పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. జన్ సురాజ్ పేరుతో అక్టోబర్ 2వ తేదీ నుంచి బీహార్ లో సుమారు 3 వేల కిలోమీటర్ల పాదయాత్రకు రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న జన్ సూరజ్ వేదికే భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే అవకాశాలను వివరించారు. వాస్త‌వానికి పీకే పార్టీ పెట్ట‌డం ద్వారా.. త‌ట‌స్థంగా ఉన్న నాయ‌కుల‌ను ఆయ‌న ఆక‌ర్షించ‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ సాగింది. ముఖ్యంగా మోడీని గ‌ద్దె దింపాల‌నే వ్యూహంతో పీకే అడుగులు వేయ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు కూడా వ‌చ్చాయి. అయితే.. ఇప్ప‌టికిప్పుడు పార్టీ పెట్ట‌డం ద్వారా.. మ‌రో పార్టీ ఏర్పాటైంద‌నే వాద‌న త‌ప్ప‌.. త‌న‌కు ప్ర‌త్య‌క్షంగా లేదా.. ప‌రోక్షంగా జ‌రిగే మేలు అంటూ.. ఏమీ ఉండే అవ‌కాశం లేద‌ని.. పీకే భావించిన‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీ ఏర్పాటుపై పెద్ద ఎత్తున క‌థ‌నాలు వ‌చ్చాయి. రాజకీయ వ్యూహకర్త స్ధాయి నుండి రాజకీయ నేతగా అవతరించాలని పీకేలో బలమైన ఆకాంక్ష కనబడుతోందంటూ.. చ‌ర్చ కూడా సాగింది. అయితే ఆ ఆకాంక్ష ఏదైనా పార్టీలో చేరటం వల్ల నెరవేరుతుందేమో కానీ సొంతంగా పార్టీ పెడితే సక్సెస్ అయ్యే అవకాశాలు త‌క్కువ‌ని పీకే ప్రారంభంలోనే గుర్తించిన‌ట్టున్నారు. ఎందుకంటే ప్ర‌స్తుతం దేశంలో కొంద‌రు మిన‌హా ఎక్కువ మంది నేత‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి ఆదరణ దక్కటం అంతంతమాత్రంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో డైరెక్టుగా పార్టీ పెట్టేసి పెద్ద నేత అయిపోదామని పీకే అనుకుంటే ఫెయిలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే పీకే త‌న వ్యూహాన్ని మార్చుకున్నార‌నే చ‌ర్చ సాగింది.

కొంతకాలంగా దేశంలోని అనేక రాజకీయపార్టీలతో కలిసి పీకే పనిచేస్తున్న విషయం తెలిసిందే. తాను పనిచేసిన వారిలో నితీష్ కుమార్, నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి, మమతాబెనర్జీ, స్టాలిన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పీకే వైఫ‌ల్యాలు కూడా ఉన్నాయి. అయితే.. నేత‌ల‌నే గ‌ద్దె నెక్కిస్తుండ‌గా లేనిది.. తాను మాత్రం సాధించలేనా? అనుకున్నారో.. ఏమో.. పీకే పార్టీ పెట్టేందుకే మొగ్గు చూపారు. కానీ, మారుతున్న ప‌రిస్థితులు.. తానే చెప్పిన‌ట్టుగా.. మ‌రికొన్ని రోజులు బీజేపీ హ‌వా సాగుతుంద‌ని బ‌లంగా న‌మ్ముతుండ‌డం..

 దేశంలో నెంబ‌ర్ 2 నాయ‌కుడుగా మోడీని గ‌ట్టిగా ఎదుర్కొనే నేత లేక‌పోవ‌డం.. వంటివి ప్ర‌ధానంగా పీకేను వ్యూహ‌క‌ర్త‌గానే మిగిల్చి ఉంటాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ప‌రిస్థితి ఏమాత్రం త‌న‌కు అనుకూలంగా మారినా.. పీకే.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త కంటే కూడా.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకే ఎక్కువ‌గా మొగ్గు చూప‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News