ఆ జిల్లాలో పీకే టీం హ‌ల్ చ‌ల్ చేస్తోంది

Update: 2017-07-22 17:50 GMT
ఏపీ ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సలహాదారు ప్ర‌శాంత్ కిశోర్ త‌న డ్యూటీలో బిజీ బిజీ అయిపోయారు. నెల్లూరు జిల్లాలో గత నాలుగు రోజులుగా అధిష్టానం నుంచి వచ్చిన సర్వే ప్రశ్నలకు సమాధానాల కోసం సమాచార సేకరణలో బిజీబిజీగా కనిపిస్తున్నారు. ప్రశాంత్‌ కిషోరే ఈ ప్రశ్నాపత్రాన్ని రూపొందించడం విశేషం. గత రెండు - మూడురోజులుగా జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లోనూ - జిల్లా పార్టీ కార్యాలయంలోనూ వైసీపీకు చెందిన ప్రజాప్రతినిధులు - పార్టీ నేతలు ఈ సమాధాన పత్రాలను పూరించడంలో తలమునకలై ఉన్నారు. అధినాయకత్వం కోరిన సమాచార సేకరించడం తమ బాధ్యతగా భావిస్తున్న వైసీపీ కార్యకర్తలు - క్షేత్రస్థాయి నేతలు స్పష్టమైన - సమగ్ర సమాచారం అందించే పనిలో నిమగ్నమయ్యారు. మండలాల పరిధిలో ఉన్న గ్రామాలు - గ్రామాల పరిధిలో ఉన్న వివిధ వర్గాలకు చెందిన కాలనీలు, ఏ ఏ వర్గానికి ఎంతమంది ఓటర్లు, జనాభా ఉన్నారు? రాజకీయ పార్టీలు కాకుండా మరెవరైనా కులసంఘాల - వర్గ సంఘాల నేతలు ఆయా ప్రాంతాల ప్రజల్ని ప్రభావితం చేస్తున్నారా? చేస్తుంటే..వారి వివరాలు, వారి అవసరాలు తదితర ప్రశ్నలతో కూడిన స్ప‌ష్ట‌మైన‌ జాబితాను పూరించాల్సి ఉంది.

వైకాపా నేతలు క్షేత్రస్థాయిలో ఉన్న తమ అనుచరులకు వివరాల సేకరణ పనులు పురమాయించడం, వారి ద్వారా సమాచారం అందుకోవడంలో బిజీగా అయిపోయారు. పూర్తి సమాచారం కోసం మరికొందరు మండలస్థాయి నేతలు రెండు, మూడు రోజుల సమయం కోరుతున్నారు. ఇదేదో కేవలం మండల - గ్రామస్థాయి నేతలకు మాత్రమే అనుకుంటే పొరపాటు. ఎమ్మెల్యేలు - నియోజకవర్గ ఇన్‌ చార్జ్‌ లు కూడా తమ పరిధిలో ఇదే తరహా సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలనే ఆదేశాలు అందినట్లు సమాచారం. ప్రశాంత్‌ కిషోర్ కార్యాచరణలో దిగినప్పటి నుంచి పార్టీ నేతలు - కార్యకర్తల్లో ఉత్సాహంతో పాటు సమాచార సేకరణ చొరవ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సర్వే పార్టీ ద్వారా జరుగుతుంటే మరోవైపు కొందరు వ్యక్తులు గ్రామాలు - పట్టణాల్లో పర్యటిస్తూ సాధారణ ప్రజలతో పాటు వైద్యులు - న్యాయవాదులు - పాత్రికేయులు - వ్యాపారుల వంటి ప్రొఫెషనల్స్ నుంచి తమకు అవసరమైన సమాచారం సేకరిస్తుండడం గమనార్హం. ప్రభుత్వం పనితీరుతో పాటు వ్యతిరేకత గురించి ప్రశ్నలు సంధిస్తూ, ఒకవేళ ప్రతిపక్షం తరపున నియోజకవర్గంలో ఎవరు మంచి అభ్యర్థిగా భావిస్తున్నారంటూ సమాచారం తీసుకుంటున్నారు.
Tags:    

Similar News