నితీశ్ బహిష్కరిస్తే..పీకే విషెస్ చెప్పారే!

Update: 2020-01-29 17:30 GMT
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అంతే మరి... తనను దునుమాడిన వారికి కూడా విషెస్ చెప్పేంత సమయస్ఫూర్తి వారి సొంతం. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ఈ విషయంలో మరో అడుగు ముందుకేసి... తనను దునుమాడటంతో పాటు ఏకంగా పార్టీ నుంచే సస్సెండ్ చేసిన జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు ఆయన ఏకంగా శుభాకాంక్షలు చెప్పేసి తన రైటే సపరేటు అని నిరూపించుకున్నారు. అంతేకాదండోయ్.. తనను పార్టీ నుంచి గెంటేసిన నితీశ్ మరోమారు బీహార్ కు సీఎం కావాలని కూడా కోరుకుని తను ఎంత ప్రత్యేకమో చెప్పకనే చెప్పేశారు.

ఇక అసలు విషయంలోకి వస్తే... జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఓ రాజకీయ అవతారం ఎత్తిన పీకే... జేడీయూ మిత్రపక్షంగా కొనసాగుతున్న కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను బహిరంగంగానే ఎండగట్టారు. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలకు మద్దతు ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీఏ వైరి వర్గం ఆప్ తరఫున ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఢిల్లీలో బీజేపీ గెలవకుండా.. మరోమారు ఆప్ సర్కారే రావాలన్న దిశగా ఏకంగా ఎన్నికల ప్రచారంలోనూ పాలుపంచుకుంటున్నారు. అంటే స్వపక్షంలోనే విపక్షంగా మారిన పీకే వ్యవహారంపై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పీకేను అదుపులో పెట్టుకోవాలని నితీశ్ కు మోదీ అండ్ కో అల్టిమేటమే జారీ చేసింది.

ఫలితంగా తననును అదుపులో పెట్టేందుకు యత్నించిన నితీశ్ ను పీకే అంతగా పట్టించుకోలేదు. ఇంకేముంది... పీకే సహా ఆయనకు మద్దతుగా నిలుస్తున్న పవన్ కుమార్ వర్మను కూడా నితీశ్ పార్టీ నుంచి బహిష్కరించేశారు. ఈ మేరకు జేడీయూ నుంచి తనను బహిష్కరిస్తున్నట్లు ప్రకటన వెలువడగానే... చాలా కూల్ గా స్పందించిన పీకే ఆసక్తికర ట్వీట్ ను సంధించారు. తనను బహిష్కరించారన్న విషయాన్ని ఏమాత్రం ప్రస్తావించకుండానే... నితీశ్ కు శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ థ్యాంక్యూ నితీశ్ కుమార్.. మీరు మరోమారు బీహార్ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి’’ అంటూ తనదైన శైలిలో నితీశ్ కు శుభాకాంక్షలు చెప్పారు. తనను బహిష్కరించిన నితీశ్ కు గ్రీటింగ్స్ చెబుతూ పీకే సంధించిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.


Tags:    

Similar News