ప్రత్తిపాటి - పొంగూరులపై కేసు... నెక్ట్స్ ఎవరో?

Update: 2020-01-23 14:30 GMT
నవ్యాంధ్ర రాజధానిగా టీడీపీ సర్కారు ఎంపిక చేసిన అమరావతిలో భూ దందా సాగిందన్న ఆరోపణలు చేస్తున్న వైసీపీ... ఇప్పుడు కొత్తగా ఏకంగా సీఐడీతో విచారణను ప్రారంభించింది. ఈ విచారణలో భాగంగా ప్రాథమికంగా లభించిన ఆధారలే సంచలనం రేకెత్తిస్తుండగా... ప్రాథమికంగా లభించిన ఆధారాలతోనే ఓ వైపు ఆదాయపన్ను శాఖ, మరోవైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లను రంగంలోకి దించేందుకు సీఐడీ యత్నిస్తున్న వైనం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓ వైపు రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు సాగిస్తుంటే... మరోవైపు ఓ మహిళ సీఐడీ వద్దకు వచ్చి తన భూమిని ఇద్దరు మంత్రులు లాక్కున్నారని సంచలన ఆరోపణ చేసింది. ఈ కంప్లైంట్ ఆధారంగా గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు - పొంగూరు నారాయణలపై కేసులు నమోదు చేసిన సీఐడీ... తన దర్యాప్తులో మరింత వేగం పెంచింది.

నారాయణ - పుల్లారావులపై కేసు నమోదుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... రాజధాని పరిధిలోని వెంకటపాలేనికి చెందిన పోతురాజు బుజ్జమ్మ గురువారం నేరుగా సీఐడీ అధికారుల వద్దకు వచ్చింది. తనకు చెందిన 99 సెంట్ల అసైన్డ్ భూమిని టీడీపీ నేతలు కొన్నారని బుజ్జమ్మ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, బెల్లంకొండ నరసింహారావులపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఐపీసీ 420 - 506 - 120 బీ సెక్షన్లతోపాటు ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదైనట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే... కొందరు తాడికొండ - తుళ్లూరు - తాడేపల్లి - మంగళగిరిలో ఎకరాల కొద్దీ భూములు కొన్నట్లు సీఐడీ ఇప్పటికే గుర్తించింది. టీడీపీకి చెందిన కొందరు కీలక నేతలు... తెల్ల రేషన్ కార్డులు ఉన్న పేదలకు ఏవో ప్రలోభాలు చూపించి.... వారి పేరిట కోట్లాది రూపాయల విలువైన భూములను కొనుగోలు చేశారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇలా టీడీపీ నేతలు 796 మంది నిరుపేదలను ట్రాప్ చేసి భూములు కొన్నారని కూడా సీఐడీ ప్రాథమికంగా తేలిందట. ఈ విషయం ఇప్పటికే పెను కలకలం రేపుతుండగా... తాజాగా ప్రత్తిపాటి - పొంగూరులపై కేసులు నమోదు కావడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాకుండా ప్రత్తిపాటి - పొంగూరు తర్వాత ఇంకెవరన్న మాటలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
 
   

Tags:    

Similar News