అస్సలు క్షమించేది లేదు.. కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Update: 2023-05-04 22:09 GMT
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి. మరణ శిక్ష పడిన ఖైదీకి క్షమాభిక్ష పెట్టేందుకు ఆమె నిరాకరించడంతో కొందరు ప్రశంసిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే... క్షమాభిక్ష కోరిన దోషి చేసిన నేరం గురించి తెలిసివారు మాత్రం రాష్ఱపతి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. నాలుగేళ్ల చిన్నారిని రేప్ చేసి దారుణంగా చంపేసిన నిందితుడు కావడంతో ఆ దోషికి క్షమాభిక్ష పెట్టేందుకు రాష్ట్రపతి నిరాకరించారు.

2008లో మహారాష్ట్రలో వసంత దుపారే అనే 46 ఏళ్ల వ్యక్తి నాలుగేళ్ల బాలికను రేప్ చేసి చంపేశాడు. ఆ చిన్నారి నివసించే ఇంటి పక్కనే ఉండే వసంత్ ఆమె చాక్లెట్ల ఆశ చూపించి తీసుకెళ్లి రేప్ చేశాడు. ఆ తరువాత రాయితో మోది చంపేశాడు. అయితే.. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు వసంత్ ఆ నేరం చేసినట్లు నిరూపించగలిగారు. దాంతో ట్రయల్ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది.

వసంత్ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. అయితే, బాంబే హైకోర్టు కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ మరణశిక్ష ఖరారు చేసింది. అనంతరం వసంత్ 2014లో సుప్రీంకోర్టుకు వెళ్లాడు. అక్కడ కూడా ఆయనకు అనుకూలంగా నిర్ణయం రాలేదు. సుప్రీంకోర్టు కూడా మరణశిక్షనే సమర్థించింది. అక్కడికి రెండేళ్ల తరువాత 2016లో సుప్రీంకోర్టు తీర్పుపై వసంత్ రివ్యూ కోరాడు. కానీ, ఆ రివ్యూ పిటిషన్ ను కూడా కోర్టు కొట్టేసింది.

ఇక చివరి అవకాశంగా రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష కోరాడు వసంత్. కానీ.. వసంత్ చేసిన నేరం తీవ్రత దృష్ట్యా రాష్ట్రపతి ఆ క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్రపతి భవన్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దీంతో వసంత్‌కు మరణశిక్ష తప్పదని న్యాయనిపుణులు చెప్తున్నారు.

కాగా మరణ శిక్షలను వ్యతిరేకించేవారు రాష్ట్రపతి నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికి.. నాలుగేళ్ల చిన్నారిని దారుణంగా రేప్ చేసి చంపేసిన వసంత్‌కు క్షమాభిక్ష పెట్టడం ఏమాత్రం సరికాదని.. అందుకే క్షమాభిక్ష నిరాకరిస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయమే సరైనదని సోషల్ మీడియాలో నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

Similar News