రాష్ట్రపతి కంటే ఉద్యోగులకే ఎక్కువ జీతం

Update: 2017-11-20 05:24 GMT
ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాల‌పై కొత్త చ‌ర్చ మొద‌ల‌య్యే అంశం ఇది. వ్య‌వ‌స్థ‌లో కీల‌క‌మైన కార్య‌నిర్వాహ‌క ఉద్యోగులకు ద‌క్కుతున్న భ‌త్యాల‌పై ఆశ్చ‌ర్య‌క‌ర‌మై వార్త వెలుగులోకి వ‌చ్చింది. దేశ రాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి - రాష్ట్ర గవర్నర్ల కంటే ప్రభుత్వ ఉద్యోగులే అధిక వేతనాలు అందుకుంటున్నారు. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన అన్ని ప్రకటనలు రాష్ట్రపతి పేరుతోనే తయారవుతాయి. కానీ ఆయన నెల వేతనం మాత్రం త్రివిధ దళాధిపతులు, ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల కంటే తక్కువ. ఏడో పే కమిషన్ సిఫారసులు అమలు తర్వాత ఈమేరకు వేతనాల్లో భారీ వ్యత్యాసం ఏర్పడింది. రాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి - గవర్నర్ల వేతనాల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు ఏడాదికి పైగానే పెండింగ్‌ లో ఉన్నాయి.

కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రతిపాదనలను తయారుచేసి మంత్రివర్గం ఆమోదం కోసం పంపినట్టు ఆశాఖ అధికారులు తెలిపారు. కానీ ఇప్పటికీ వేతనాల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం నెలకు రాష్ట్రపతి రూ.1.50 లక్షలు - ఉపరాష్ట్రపతి రూ.1.25 లక్షలు - రాష్ట్ర గవర్నర్ రూ.1.10 లక్షల వేతనం అందుకుంటున్నారు. వీరి వేతనాలు చివరిసారిగా 2008లో పెరిగాయి. 2016 జనవరి 1వ తేదీ నుంచి ఏడో పే కమిషన్ సిఫారసులను అమలుచేశాక.. దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం - కేంద్రమంత్రివర్గ కార్యదర్శి (క్యాబినెట్ సెక్రటరీ) నెల వేతనం రూ.2.5 లక్షలు అందుకుంటుండగా - కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రూ.2.25 లక్షలు పొందుతున్నారు.

త్రివిధ (సైన్యం - వాయుదళం - నావికాదళం) దళాలకు అధిపతి అయిన రాష్ట్రపతి.. త్రివిధ దళాధిపతులు తీసుకుంటున్న వేతనం కంటే తక్కువగా అందుకుంటున్నారు. త్రివిధ దళాధిపతులు కేంద్రమంత్రివర్గ సెక్రటరీకి సమానంగా వేతనం పొందుతున్నారు. నెల వేతనం రాష్ట్రపతికి రూ.5లక్షలు - ఉపరాష్ట్రపతికి రూ.3.5లక్షలు - గవర్నర్లకు రూ.3లక్షలు ఇవ్వాలని కొత్త ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి - మాజీ ఉపరాష్ట్రతులకు - వారు మరణించిన పక్షంలో వారి జీవిత భాగస్వాములకు - మాజీ గవర్నర్లకు పింఛన్లు పెంచే అంశంపైనా ప్రతిపాదనలు రూపొందించారు.
Tags:    

Similar News