ఆ చిన్నారి ఇంటికి నేరుగా వెళ్లి సర్ ప్రైజ్ చేసిన ఆ దేశ యువరాజు

Update: 2019-12-04 05:26 GMT
అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ సర్ ప్రైజ్ చేశారు. విషయం చిన్నదే అయినా ఆయన స్పందించిన తీరు గొప్పగా ఉండటమే కాదు.. దేశ ప్రజల మనసుల్ని గెలిచేసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి నోళ్లలో నానటమే కాదు.. ఆయన్ను అందరూ ప్రశంసలతో ముంచెత్తటమే కాదు.. యువరాజు గొప్ప మనసును వేనోళ్లు కీర్తిస్తున్నారు.

ఇంతకూ జరిగిందేమంటే.. గత వారం అక్కడి అధ్యక్ష భవనంలో ఒక కార్యక్రమం జరిగింది. దానికి యువరాజు హాజరయ్యారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పదుల సంఖ్యలో చిన్నారులు వెళ్లారు. చేతిలో యూఏఈ జెండా పట్టుకొని వరుసగా నిలుచొని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యువరాజు చిరునవ్వుతో చిన్నారులకు షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు కదిలారు. ఆ వరుసలో ఉన్న అయేషా అనే చిన్నారి.. యువరాజుకు షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

అంతలోనే ఆ చిన్నారిని చూసుకోకుండా ముందుకు కదిలారు యువరాజు. దీంతో ఆ చిన్నారి మోము చిన్నబోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యువరాజు షేక్ హ్యాండ్ మిస్ కావటంతో హతాశురాలైంది చిన్నారి. దీనికి సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వెళ్లటం.. చివరకు విషయం యువరాజు వరకూ వెళ్లింది.

దీంతో ఆయన ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరుగా ఆ బాలిక ఇంటికి వెళ్లి ఆశ్చర్యానికి గురి చేశారు. షేక్ హ్యాండ్ మిస్ అయ్యిందని బాధ పడుతున్న చిన్నారికి ఏకంగా.. నుదిటి మీద ముద్దుపెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషానికి గురి చేశారు. దీంతో యువరాజు తీరుపై అందరిలో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక.. చిన్నారి.. వారి కుటుంబం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.
Tags:    

Similar News