ప్రైవేటు కంపెనీల జీతాలు 1నే ప‌డుతున్నాయి.. ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప‌డ‌డం లేదా?!

Update: 2022-05-06 13:34 GMT
ఎవ‌రు ఎక్క‌డ ప‌నిచేసినా.. అది ప్రైవేటైనా.. ప్ర‌భుత్వ‌మైనా.. వేత‌న జీవులు కోరుకునేది.. స‌మ‌యానికి ద‌క్కే జీతం రాళ్ల‌నే. 30 రోజులు ప‌నిచేసేది.. త‌దుప‌రి నెల 1న ప‌డే వేతనం కోస‌మే! అది ఎంత అనేది ప‌క్క‌న పెడితే.. వ‌చ్చేది ఎంతైనా.. 1న ప‌డితే.. అది మ‌హా ప్ర‌సాదంగా.. వేత‌న జీవులు భావిస్తారు. అందుకే.. ప్రైవేటు కంపెనీలు సైతం.. త‌క్కువ-ఎక్కువ అనే విష‌యాన్ని ప‌క్కన పెడితే.. ప్ర‌తి నెలా ఠంచ‌నుగా 1నే త‌మ ఉద్యోగుల‌కు వేత‌నాలు వేస్తుంటాయి. మ‌రికొన్ని సంస్థ‌లైతే.. ఈ విష‌యంలో మ‌రింత ఉదారంగా కూడా ఉంటున్నాయి. 1వ తేదీ ఏ కార‌ణంగా అయినా.. బ్యాంకుల‌కు సెల‌వు అయితే..

ముందు నెల 30 లేదా 29వ తేదీల్లోనే వేత‌నాలు వేసే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీనివ‌ల్ల‌.. ఉద్యోగులు ఉత్సాహంతో ప‌నిచేయ‌డ‌మే కాకుండా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా కూడా ప‌నిని సాఫీగా చేస్తార‌ని కంపెనీలు, ప్రైవేటు సంస్థ‌లు కూడా భావిస్తుంటాయి. అందుకే వేత‌నం విష‌యంలో ఖ‌చ్చిత‌మైన స‌మ‌య పాల‌న‌ను పాటిస్తుంటాయి. ఇక‌, ప్ర‌భుత్వంలో ప‌నిచేసే ఉద్యోగుల‌.. గురించి చెప్పేదేముంది. చిన్న చిన్న కంపెనీలే.. 1న లేదా.. అదే నెల 30న వేత‌నాలు వేస్తున్న‌ప్పుడు.. అతి పెద్ద వ్య‌వ‌స్థ అయిన ప్ర‌భుత్వం స‌మ‌యానికి వేయ‌దా! అంటే.,. ఖ‌చ్చితంగా వేస్తాయి. ప్ర‌తి నెల 1నే వేత‌నాలు ఇస్తాయి. ఇక్క‌డ కూడా 1వ తేదీ సెల‌వు ఉంటే.. ముందు రోజే వేత‌నాలు ఇచ్చిన ప‌రిస్థితి ఉంది.

అయితే.. ఈ ఫార్ములా ఎక్క‌డైనా చెల్లుతుందేమో.. కానీ, జ‌గ‌న‌న్న రాజ్యంలో మాత్రం చెల్ల‌ద‌ని అంటున్నారు. ``ఎప్పుడో అప్పు డు ఇస్తున్నాం క‌దా! యాగీ ఎందుకు!?`` అని సాక్షాత్తూ.. నిరుడు.. ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డే ప్ర‌శ్నించారంటే.. ఏపీలో ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. ప్ర‌తి నెల 1నే వేతనం ప‌డుతుంద‌ని భావించే ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు.. తొలిసారి.. ఏపీలో చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఎప్పుడు ఇస్తారో.. తెలియ‌దు. ఇచ్చినా.. కొన్ని విభాగా ఉద్యోగుల‌కు ఎంత ఇస్తారో .. కూడా తెలియ‌ని ఒక సందేహ, విస్మ‌యాత్మ‌క ప‌రిస్థితి నెల‌కొంది. విడ‌త‌ల వారీగా ఇచ్చిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఉంటున్నాయి కూడా!!

ఇలా.. వేత‌నాలు ఆల‌స్యం కావ‌డానికి సాంకేతిక కారణాలే కార‌ణ‌మంటూ.. సర్కారు ప‌లు మార్లు చెప్పింది.  ఇలా.. నెలలో 10, 15, 20వ తేదీ వరకూ జీతాలు, పెన్షన్లు పడుతూనే ఉంటాయి.  స‌రే.. సాంకేతిక కార‌ణం అంటే.. ఒక‌టి రెండు నెల‌లు అనుకోవ‌చ్చు. కానీ, దాదాపు రెండు సంవ‌త్స‌రాలుగా(క‌రోనా స‌మ‌యంలోనూ) వేత‌నాలు ఆల‌స్యం అవుతూనే ఉన్నాయి. ప్రతి నెలా ఇదేం తంతు అంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. నెలంతా పని చేసినా సకాలంలో వేతనాలు ఇవ్వకపోతే... ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పిల్లల చదువుల కోసం,  ఇళ్ల రుణాలు, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల రుణాలు తీసుకున్న ఉద్యోగులు ఈఎంఐల చెల్లింపులు కటాఫ్‌ డేట్‌గా 5వ తేదీని పెట్టుకుంటారు.

నెలలో ఐదవ తేదీ దాటితే.. అప్ప‌టికి కూడా రుణాల వాయిదా చెల్లించ‌క‌పోతే..  క్రెడిట్‌ స్కోర్‌ పడిపోతుంది. ఈఎంఐలు సకాలంలో కట్టకపోతే చెక్‌ బౌన్స్‌లు అవుతాయి. ఇక విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయం. తాము 30 , 40 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగులుగా సర్వీసుచేసి... వృద్ధాప్యంలో సకాలంలో పెన్షను పొందలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. పెన్షన్‌ ఆలస్యం అవుతుండటంతో కనీసం మందు లు సకాలంలో కొనుక్కొవాలన్నా ఏ నెలకానెల అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఈ నెల ప‌రిస్థితి ఇదీ..

ప్ర‌స్తుత మే నెల విష‌యానికి వ‌స్తే.. ఐదో తేదీ వచ్చినా... ఇప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లలో సగంమందికి చెల్లింపులు జరపలేదు. జీతాలు, పింఛన్ల నెల పద్దు రూ.5400 కోట్లు. ఇప్పటి వరకు సుమారు రూ.2 వేల కోట్ల వరకే చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది. అంటే.. సగం మందికి కూడా ఇంకా వేయనట్టే క‌దా!!  మ‌రి ఇలాంటి ప‌రిస్థితి దేశంలో ఎక్క‌డైనా.. ఏ రాష్ట్రంలో అయినా.. ఉదాహ‌ర‌ణ‌కు అంతంత మాత్రం ఆదాయం ఉన్న బీహారం వంటి రాష్ట్రాల్లో అయినా.. ఉందా అంటే లేద‌నే చెప్పాలి. కేవ‌లం అది ఏపీలోనే సాధ్యం.. అది కూడా వైసీపీ పాల‌న‌లోనే సాధ్యం అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News