క‌న్న‌య్య‌కు ఊహించ‌ని తీర్పు వ‌స్తుంద‌ట‌

Update: 2017-03-02 04:49 GMT
గ‌త ఏడాది అనూహ్య రీతిలో తెర‌మీద‌కు వ‌చ్చిన ఢిల్లీ జేఎన్‌ యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ పై బనాయించిన దేశద్రోహం కేసు నుంచి ఆయ‌ను విముక్తి ల‌భించింది. కేసు నమోదు చేసిన ఏడాది తరువాత అందుకు తగిన సాక్ష్యాలు లభించలేదని ఢిల్లీ పోలీసులు చేతులెత్తేశారు. గతేడాది ఫిబ్రవరిలో నమోదైన కేసు దేశ దోహానికి సంబంధించినదే అనడానికి తగిన సమగ్ర సాక్ష్యాలు లభించలేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించినట్లు జాతీయ మీడియా వివ‌రించింది. రాజద్రోహ నేర అభియోగాలపై కన్నయ్య కుమార్‌ ను జైలుకు పంపిన విషయం తెలిసిందే. కన్నయ్యతో పాటు జెఎన్‌ యు విద్యార్థులు అనిర్బన్‌ భట్టాచార్య - ఉమర్‌ ఖలీద్‌ లను కూడా జైలుకు పంపారు. వీరు ఇప్పుడు బెయిల్‌ పై బయట ఉన్నారు. ముసాయిదా చార్జిషీటు-ఆధారాల‌ ప్రకారం ఖలీద్‌ - భట్టాచార్యపై చ‌ర్య‌లు ఉండే అవకాశం క‌నిపిస్తోంది.

జేఎన్‌ యూలో జాతి వ్యతిరేక నినాదాలు చేశారనేందుకు రుజువుగా దాదాపు 40 వీడియో క్లిప్పులకు సంబంధించి ఫారెన్సిక్‌ నివేదికలను చార్జి షీటులో పేర్కొన్నారు. దాదాపు 140 మంది నిరసనకారులు భారత్‌ వ్యతిరేక నినాదాలు చేసినట్లు వీడియోలలో వుంది. వీరిలో 9 మందిని వెలుపలి వారిగా గుర్తించారు. వీరు కాశ్మీర్‌ నుంచి వచ్చారు. వీరి వ్యాఖ్యలను కూడా పోలీసులు నమోదు చేశారు. జెఎన్‌ యులో జరిగిన కార్యక్రమంలో కన్నయ్య కుమార్‌ పాల్గొన్నట్లు చార్జిషీటులో పేర్కొనలేదు. అయితే జేఎన్‌ యు విద్యార్థి సంఘం నాయకుడిగా జాతి వ్యతిరేక నినాదాలు చేస్తున్నవారిని అడ్డుకోలేదని పేర్కొన్నారు. కాగా కన్నయ్య కుమార్‌ పై అభియోగాల నమోదు అంశాన్ని కోర్టు నిర్ణయానికే పోలీసులు వదిలేసినట్లు మీడియా తెలిపింది.

తాజా వార్త‌ల నేప‌థ్యంలో కన్నయ్య కుమార్ మీడియాతో మాట్లాడుతూ జేఎన్‌ యూలో ఒక కార్యక్రమాన్ని అనుమతించాలా, అనుమతించ కూడదా అనే అధికారం తనకు లేదన్నారు. వైస్‌ ఛాన్సలర్‌ గాని, ప్రోక్టర్‌ గాని దానిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. త‌న‌పై మోపిన నేరం ఉద్దేశ‌పూర్వ‌క‌మైన‌ద‌ని తాను మొద‌టి నుంచి చెప్తున్న‌ట్లు క‌న్న‌య్య తెలిపారు. కోర్టులో కూడా ఇదే రీతిలో తీర్పు వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు క‌న్న‌య్య తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News