కాంగ్రెస్ మిత్రుల ట‌చ్ లోకి కేసీఆర్.. ఆధారాలివే!

Update: 2019-05-09 05:32 GMT
ఏం కావాల‌న్న విష‌యం మీద క్లారిటీ ఉన్న‌ప్పుడు.. అందుకు త‌గ్గ‌ట్లే అడుగులు ప‌డుతుంటాయి. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల్ని చూస్తే.. ఇది నిజ‌మ‌నిపించ‌క‌మాన‌దు. గ‌డిచిన కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వేస్తున్న అడుగులు.. క‌దుపుతున్న పావుల్ని చూస్తుంటే.. కాంగ్రెస్ మిత్రుల‌తో దోస్తీ కోసం ఆయ‌న ప‌డుతున్న త‌ప‌న అంతా ఇంతా కాదు.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ వినిపిస్తున్న వాద‌న‌కు భిన్నంగా ఆయ‌న అడుగులు ప‌డుతున్నాయి. సొంతంగా ఫ్రంట్ నడిపే స‌త్తా త‌న‌కు లేద‌న్న విష‌యంలో కేసీఆర్ కు క్లారిటీ ఉంది. అలా అని ఆ విష‌యాన్ని త‌న‌కు తానుగా చెప్పుకోలేని ప‌రిస్థితి. అందుకే స‌రికొత్త వాద‌న‌ను తెర మీద‌కు తీసుకురావ‌టం ద్వారా త‌న ఉనికిని ప్ర‌త్యేకంగా చూపించుకుంటే మంత‌నాల పేరుతో.. ర‌హ‌స్య ఎజెండాను అమ‌లు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ఆయ‌న స్నేహం కోసం చేతులు చాస్తున్న వారంతా కాంగ్రెస్ మిత్రులే కావ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఏది ఏమైనా.. తాజాగా కేంద్రంలో కొలువు తీరే ప్ర‌భుత్వంలో త‌న పాత్ర కీల‌కంగా ఉండాల‌ని కేసీఆర్ త‌పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కేంద్రం ద‌న్ను త‌ప్ప‌నిస‌రి. పెద్ద ఎత్తున నిధుల్ని.. కేటాయింపుల్ని తెలంగాణ‌కు చేసుకోగ‌లిగితేనే.. ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగ‌మించే అవ‌కాశం ఉంది. ఈ కార‌ణంతోనే కేంద్రంలో కొలువు తీరే ప్ర‌భుత్వంలో కీల‌క‌మైతే.. అత్య‌ధికంగా ప్ర‌యోజ‌నాలు పొందే వీలుంద‌న్న భావ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఈ ఆలోచ‌న‌తోనే ఆయ‌న స‌రికొత్త‌ స్నేహ‌రాగాన్ని ఆల‌పిస్తున్నారు. ఓప‌క్క కాంగ్రెస్ ను ఖ‌తం పెట్టాల‌న్న‌ట్లుగా తెలంగాణ‌లో వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న‌.. జాతీయ స్థాయిలో అదే పార్టీ ద‌న్ను కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా కొన్ని క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఇలాంటి వాటిని కేసీఆర్ అండ్ కో ఖండిచ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు కానీ.. ఇప్పుడు కానీ కేసీఆర్ మంత‌నాలు జ‌రుపుతున్న కొత్త స్నేహితుల్ని చూస్తే.. వారంతా కాంగ్రెస్ కు ప్ర‌త్య‌క్ష‌.. ప‌రోక్ష మిత్రులు కావ‌టం విశేషం. సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ముందు ఆయ‌న భేటీ అయిన బెంగాల్ మ‌మ‌తా.. ఒడిశా న‌వీన్.. యూపీ అఖిలేశ్‌.. క‌ర్ణాట‌క కుమార‌స్వామి.. కేర‌ళ విజ‌య‌న్.. త‌మిళ‌నాడు స్టాలిన్ తో స‌హా అంతా కాంగ్రెస్ కు మిత్రులే కావ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఇదంతా చూసిన‌ప్పుడు కాంగ్రెస్ మిత్రుల‌తో స్నేహం ద్వారా.. కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర కావాల‌న్న య‌త్నంలో కేసీఆర్ ఉన్నారా? అన్న సందేహం రాక మాన‌దు.
Tags:    

Similar News