ట్రంప్ చ‌ర్య మ‌న‌కు గొడ్డ‌లిపెట్టే అంటున్న నాస్కాం

Update: 2018-01-02 07:06 GMT
వ‌ల‌స ఉద్యోగుల‌ను వీలైనంత వ‌ర‌కు త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇందుకు అనే చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విదేశీయులు అమెరికా నిరుద్యోగుల కడుపుకొడుతున్నారని ఆరోపిస్తూ హెచ్-1బీ వీసాల జారీని మరింత కఠినతరం చేయాలని కోరుతూ అమెరికా సెనెట్ ముందుకు (ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్) ఓ బిల్లు వచ్చిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది.  గత ఏడాది డిసెంబ‌ర్ నెల‌లో 'ప్రొటెక్ట్‌ అండ్‌ గ్రో అమెరికన్‌ జాబ్స్‌ యాక్ట్‌ (హెచ్‌ ఆర్‌ 170)'కు అమెరికన్‌ కాంగ్రెస్‌ హౌస్‌ జ్యుడిషియరీ కమిటీ ఆమోద ముద్ర వేసిన సంగ‌తి తెలిసిందే. హెచ్‌1బి వీసాలతో అమెరికా వెళ్తున్న ఇండియన్ల ఉద్యోగాలకు ఈ చట్టం ఒక మరణ శాసనమ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ప‌రిణామంపై నాస్కాం స్పందించింది. ఇంత‌కుముందు ఎన్న‌డూ లేని ష‌ర‌తులు విధించిందని పేర్కొంది.ఈ భారమైన ష‌ర‌తులు భార‌తీయ ఐటీ కంపెనీలు - హెచ్‌1బీ వీసాపై ఆధార‌ప‌డే కంపెనీల‌కు గొడ్డ‌లిపెట్టు వంటిద‌ని నాస్కాం హెచ్చ‌రించింది. ఈ బిల్లు స‌హా ఇత‌ర‌త్రా వీసాల నిబంధ‌న‌ల‌పై ఇప్ప‌టికే తాము అమెరికా ప్ర‌తినిధుల‌తో  చ‌ర్చించామ‌ని నాస్కాం వెల్ల‌డించింది. రాబోయే వారంలో మ‌రోమారు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్లు వివ‌రించింది. యూఎస్ సెనెట‌ర్లు - కాంగ్రెస్ స‌భ్యులు - అధికారుల‌తో భేటీ కానున్న‌ట్లు నాస్కాం అధ్య‌క్షుడు ఆర్‌.చంద్ర‌శేఖ‌ర్ వెల్ల‌డించారు.

దాదాపు 20 కంపెనీల్లో ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకూడదని ఆ కంపెనీలను నిషేధించాలని ప్రొటెక్ట్‌ అండ్‌ గ్రో అమెరికన్‌ జాబ్స్‌ యాక్ట్‌ (హెచ్‌ ఆర్‌170) బిల్లు సారాంశం. అమెరికన్లకే అమెరికా ఉద్యోగాలు అంటూ అధ్యక్ష పీఠం ఎక్కిన‌ ట్రంప్ నినాదం ఈ విధంగా కార్యరూపం దాల్చింది. ఈ వీసా జారీ చేయడానికి కనీస వార్షిక వేతనాన్ని ప్రస్తుతమున్న 60 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచాలని - మాస్టర్స్ డిగ్రీ మినహాయింపును తొలగించాలని ఈ బిల్లులో ప్రధానంగా నిర్దేశించారు. రిపబ్లికన్ ప్రతినిధి డారెల్ ఇస్సా - డెమోక్రటిక్ సభ్యుడు స్కాట్ పీటర్స్ ఈ బిల్లును బుధవారం అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారు. వీరిద్దరూ యూఎస్ లో భారతీయులు ఎక్కువగా ఉండే కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన వారు కావడం విశేషం.

ఇదిలాఉండ‌గా....హెచ్‌-1బీ వీసాదారుల భాగ‌స్వామ్యులు అమెరికాలో ఉద్యోగాలు చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోనున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ షాకింగ్ విషయాన్ని యూఎస్‌ డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ(DHS) అధికారికంగా వెల్లడించింది. ట్రంప్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న ‘బై అమెరికన్‌ - హైర్‌ అమెరికన్‌’ పాలసీ విధానంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. 2015లో అప్పటి అధ్యక్షుడు ఒబామా హెచ్‌-1బీ వీసాదారులు - గ్రీన్‌ కార్డు కోసం వేచి చూస్తున్న భార్య/భర్తలు అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు అర్హులుగా నిబంధన తీసుకొచ్చారు. హెచ్‌-4 డిపెండెంట్‌ వీసా కింద ఒబామా ప్రభుత్వం వాళ్లు ఉద్యోగాలు చేసుకునేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానానికి ట్రంప్‌ ప్రభుత్వం ముగింపు పలకనుంది. ఇలా చేయడం వల్ల హెచ్‌-1బీ  భార్యలు యూఎస్‌లో ఉద్యోగాల చేయడం కష్టతరమవుతుంది. దీనితో పాటు హెచ్‌-1బీ వీసా నిబంధనల్లోనూ మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఒబామా తీసుకొచ్చిన ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లోనే సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ ఏ అనే బృందం న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నిబంధన అమెరికన్ల ఉద్యోగాలను దెబ్బతీస్తుందని పిటిషన్‌ లో తెలిపింది.
Tags:    

Similar News