ట్రంప్ వ్యతిరేకులు రచ్చ రచ్చ చేస్తున్నారు!

Update: 2016-11-09 14:50 GMT
సర్వేల జోస్యాలను, ఎగ్జిట్ పోల్ అంచనాలను, చాలామంది ఆశలను తలకిందులు చేస్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఘనవిజయం సాధించారు. దీంతో బుధవారం తెల్లవారుజామున అమెరికా అంతటా నిరసనలు హోరెత్తుతున్నాయి. హిల్లరీ గెలవలేదనే బాదకంటే.. ట్రంప్‌ గెలిచారనే ఆవేదన వారికి ఎక్కువైపోయింది. దీంతో ట్రంప్ గెలుపును ఏమాత్రం జీర్ణించుకోని ఆయన వ్యతిరేకులు నార్త్‌ కాలిఫోర్నియా నుంచి సీటెల్‌ వరకు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేపట్టారు. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది.
 
ఈ సమయంలో కాలిఫోర్నియా ఓక్లాండ్‌ డౌన్‌ టౌన్‌ లో సుమారు 100 మంది గుమిగూడి ట్రంప్ గెలిచారనే విషయాన్ని తెలిపిన ఎన్నికల ఫలితాల్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. ట్రంప్‌ కు వ్యతిరేక నినాదాలు చేస్తూ ర్యాలీలు చేపట్టారు. అనంతరం కాబోయే అమెరికా అధ్యక్షుడైన ట్రంప్‌ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. అక్కడితో ఆగని నిరసనకారులు స్థానికంగా ఉన్న ఇళ్ల అద్దాలను బద్దలుకొట్టి హింస్మాత్మక చర్యలకు పూనుకుంటున్నారట. వీరి నిరసనలు అలా ఉంటే మరోవైపు బర్కెలీ, సాన్‌ జోస్‌ ప్రాంతాల్లోనూ విద్యార్థులు వందలసంఖ్యలో రోడ్డెక్కి ట్రంప్‌ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. అలాగే పోర్ట్‌ ల్యాండ్‌ లోనూ ట్రంప్‌ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక్కడ భారీసంఖ్యలో గుమిగూడిన నిరసనకారులు రోడ్లపై వాహనాలను నిలిపివేసి.. ఆందోళన చేపడుతున్నారు.
 
ఇదే క్రమంలో అమెరికా అధ్యక్ష భవనం (వైట్‌ హౌస్‌) ఎదురుగా కూడా నిరసనకారులు గుమిగూడి ట్రంప్‌ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. సుమారు వెయ్యిమందికి పైగా ట్రంప్ వ్యతిరేకులు వైట్‌ హౌస్‌ ఎదురుగా ఆందోళన చేస్తున్నారట. తాజా ఎన్నికల ఫలితాలను తాము తిరస్కరిస్తున్నట్టు ఆందోళనకారులు చెప్తున్నారట.

వీరి నిరసన అలా ఉంటే... ట్రంప్ విజయం కొంతమంది హాలీవుడ్ నటుల్లోనూ భయం పుట్టిస్తోందట. ముఖ్యంగా ఖేర్, క్రిస్ ఇవాన్స్ వంటి నటులు ట్రంప్ విజయంపట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీరంతా రకరకాలుగా ట్రంప్ గెలుగుపు అనంతరం స్పందించారు. "ఇది అమెరికాకు చాలా కలవరాన్ని పుట్టించిన రాత్రి" అని క్రిస్ ఇవాన్స్ అనే హాలీవుడ్ నటుడు స్పందిస్తే... "ట్రంప్ అసలు ఈ విజయం సాధించాడు? అమెరికాలో ఈ రాత్రిని మించిన హాస్యం మరొకటి లేదు" అని ఖెర్ అనే మ్యూజిక్ ఆర్టిస్టు స్పందించాడు. ముస్లింలు - మహిళలు - వలసదారులు - ఎల్జీబీటీ కమ్యునిటీ విషయంలో తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, భవిష్యత్తులో వారి తరుపున పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని జెస్సీ టైలర్ ఫెర్గూసన్ అనే నటుడు తెలిపాడు.

కాగా... ఎన్నికల ప్రచార సమయంలో హాలీవుడ్ లోని చాలామంది నటులంతా హిల్లరీకే బహిరంగంగా మద్దతు ప్రకటించగా... మరికొంతమంది నటులు ట్రంప్ పై పరుషపదజాలాలతో తిట్లవర్షాలు కుర్పించిన సంగతి తెలిసిందే. వీరిలో ట్రంప్ ని ముక్కుపై గుద్దాలని ఉందని ఒకరంటే... ట్రంప్ గెలిస్తే అమెరికా వదిలి వెళ్లిపోతానని మరోనటుడు తెలిపిన సంగతి తెలిసిందే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News