పృధ్వీదే లాస్ట్ పంచ్ : వైసీపీకి ఇది కదా అసలైన పోటు

Update: 2022-08-11 16:31 GMT
అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అని వెనకటికి ఒక ముతక సామెత ఉంది. ఇపుడు అలాంటి పరిస్థితినే వైసీపీ ఎదుర్కొంటోంది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పేరిట వచ్చినట్లుగా చెప్పబడుతున్న న్యూడ్ వీడియో మీద అందరూ మాట్లాడేశారు. ఇక ఎవరన్నా మిగిలి ఉన్నారా అంటే ఉన్నారు.  అలా ఒకే ఒక్కడు. ఆయనే థర్టీ యియర్స్ ఇండస్ట్రీ ఫేమ్ సినీ నటుడు పృధ్వీరాజ్.

అవును ఆయనదే లాస్ట్ పంచ్. ఆయన అలా వేశాక విలవిలలాడడం తప్ప వైసీపీకి మిగిలేది ఏమీ లేదు. ఎందుకంటే ముందే చెప్పుకున్నట్లుగా విపక్షం ఎపుడూ విమర్శలు చేస్తుంది. కానీ తాము తెల్ల బట్ట తొడుక్కున్నామని దానికి మరక అంటించాడని ఇప్పటికి మూడేళ్ళ క్రితం పృధ్వీని ఆయన ఉన్న పదవి నుంచి దించేసి వైసీపీ అధినాయకత్వం తన సత్యసంధతను అలా చాటుకుంది.

వైసీపీకి వీర లెవెల్ భక్తుడిగా ఉంటూ ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక సినీ రంగం తరఫున తొట్ట తొలిగా పదవిని అందుకున్న వారు పృధ్వీ. అది కూడా శ్రీ వెంకటేశ్వరా భక్తి చానల్ కి చైర్మన్ గా. అలాంటి పృధ్వీ రాసలీలలు పేరిట ఆడియో టేపులు బయటకు వచ్చాయి. అందులో వాయిస్ ఆయందే అంటూ అంతా అన్నారు. మహిళా సంఘాలు అయితే ఆందోళన చేశాయి. మొత్తానికి వైసీపీ అపుడే అధికారంలోకి వచ్చింది.

వెంటనే చికాకూ చీ కలిగించే ఇలాంటి అశ్లీల ఆడియో. అది కూడా ప్రపంచం అంతా కొలిచే వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తి చానల్ లో పనిచేసే ఆసామి పృధ్వీ పేరిట. ఆ ఆరోపణలు భరించలేని వైసీపీ ఆయన్ని పదవి నుంచి దించేసింది. ఆ తరువాత ఆయనను మెల్లగా సాగనంపారు. ఇప్పుడు ఇన్నాళ్ళకు పృధ్వీ నోరు తెరుస్తున్నారు. మళ్ళీ పోయిన రాజకీయ జీవితాన్ని వేరే పార్టీలో వెతుక్కునే ప్రయత్నంలో ఉన్నారు.

మరి ఆయనకు వైసీపీ మీద పీకల మీద కోపం ఉంటుంది కదా. అందుకే ఆయన బిగ్ సౌండ్ చేశారు. వైసీపీ ఎంపీ మాధవ్ పరువు తీశారని నిందించారు. తెలుగు ఎంపీలకు పార్లమెంట్ లో ఉన్న చరిత్రను మంటగలిపారు అని కూడా నిప్పులు చెరిగారు. అనంతపురం ఎస్పీ ఫేక్ వీడియో అని చెబుతున్నా జనాలకు అసలు వీడియో ఏదో తెలుసు అంటూ పృధ్వీ చెప్పాల్సినది చెప్పేశారు. ఇక నాడు తనను విమర్శిస్తూ మీడియా ముందుకొచ్చిన వైసీపీ నేతల నోళ్ళు ఏమైపోయాయి అని కూడా ఆయన క్లాస్ పీకారు.

ఏది ఏమైనా వైసీపీ నీతి న్యాయం మనిషి మనిషికీ మారుతోందని కూడా పృధ్వీ నొరు పెద్దది చేసి  అనగలిగారు. ఆయన మాత్రమే  ఇది అనగలరు. ఎందుకంటే నేడు ఆయన జనానికి  వైసీపీ బాధితుడిగా ఉన్నారు. ఆయన కో న్యాయం మాధవ్ కో న్యాయమా అంటే జనాలు పూర్తిగా  నమ్ముతారు కూడా డబ్బు, పలుకుబడి, కులం అన్నీ కలసి మాధవ్ కాపాడుకున్నారని కూడా పృధ్వీ విమర్శలు చేశారు.

సరే ఇదంతా ఆయన అన్నా కూడా వైసీపీ అధినాయకత్వానికి ఈ విమర్శ మాత్రం గుక్కతిప్పుకోలేనిదే. ఏది మీ నిజాయతీ, ఏదీ మీ నిక్కచ్చితనం అంటూ ఆయన ప్రశ్నిస్తున్నట్లుగానే ఉంది. ఇక్కడ మాధవ్ మీద చర్య తీసుకుని ఉంటే పృధ్వీ నోరు లేచేది కాదేమో. కానీ వదిలేయడం వల్లనే ఆయన కూడా ఒక పోటు పొడిచారు.

మరి ఈ పోటుకు గుక్కబట్టి ఏడవడం తప్ప చేసేది కూడా ఏమీ లేదు. కాస్తా ఆలస్యంగా గోరంట్ల మీద యాక్షన్ తీసుకున్నా వైసీపీకి ఏమీ ఒరిగేది లేదు. మొత్తానికి ప్రతీ వారికీ ఒక చాన్స్ వస్తుంది అంటారు. అదిపుడు పృధ్వీకి వచ్చింది. మూడేళ్ళు ఆలస్యం అయినా ఆయన కోసం పంచ్ ఒకటి రెడీగా  ఉంది. ఆయన  మాత్రమే  వేసే పంచ్ అది. అవతల వారు ఎంతటి వారు అయినా తలవంచే పంచ్ అది.


Tags:    

Similar News