ర‌క్తం మ‌రుగుతోందంటూ...మోడీ కీల‌క వ్యాఖ్య‌లు

Update: 2019-02-15 13:49 GMT
జ‌మ్ముక‌శ్మీర్‌లోని పుల్వామాలో గురువారం ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో 40 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా కూడా తీవ్రవాదంపై భ‌గ్గుమంటున్నారు. ఈ దుర్ఘ‌ట‌న‌పై తాజాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘాటుగా స్పందించారు. పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోడీ అమరులైన జవాన్ల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. `భారత్‌ లో అస్థిరత్వం సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సాగవు. పుల్వామా ఉగ్రదాడికి 130 కోట్ల భారతీయులు ధీటైన సమాధానం ఇస్తారు. ఉగ్రదాడిని ఖండించిన దేశాలకు కృతజ్ఞతలు. విజయం సాధించేందుకు తాము పోరాడుతున్నాం. ఈ ఉగ్రదాడి వెనుక ఉన్నవారు తప్పక శిక్ష అనుభవిస్తారు. భద్రతాబలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. వారి ధైర్యసాహసాలపై నాకు పూర్తి నమ్మకముంది. దేశ రక్షణ, దేశ అభివృద్ధి కోసం ప్రాణాలర్పించిన వారికి నివాళులు. అమరుల సేవలను జీవితంలో ప్రతి క్షణం గుర్తుంచుకుంటా. వీర సైనికుల త్యాగాలను ఏ మాత్రం వృథాగా పోనివ్వం`` అని మోడీ పేర్కొన్నారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ చాలా ఆవేశంగా మాట్లాడారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు సంతాపం ప్రకటించారు. ఈ దాడిని అన్ని దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి అన్ని దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ దాడి వెనుక ఉన్న వాళ్లను కచ్చితంగా శిక్షిస్తాం అని స్పష్టం చేశారు. ఇది భావోద్వేగాలతో కూడిన సమయమని, ఈ దాడిని రాజకీయం చేయొద్దని కోరారు. ``ఈ పని ఎవరు చేశారోగానీ చాలా పెద్ద తప్పు చేశారు. దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదు`` అని మోడీ హెచ్చ‌రించారు. ఈ విషయంలో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఇలాంటి దాడులతో భారత్‌ను బలహీనపరచాలని చూస్తున్న పాకిస్థాన్ ఆటలు సాగవని హెచ్చరించారు. ``భద్రతా బలగాలను పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ప్రజల రక్తం మరుగుతోంది. మన పొరుగు దేశాన్ని ఇప్పటికే అంతర్జాతీయంగా ఒంటరిని చేశాం. ఇలాంటి ఉగ్రదాడులతో ఇండియాను అస్థిర పరచాలని భావిస్తోంది. కానీ వాళ్ల ఆటలు సాగవు`` అని మోడీ స్పష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా భద్రతా దళాలకు ప్ర‌ధాని మోడీ కీల‌క‌ పిలుపునిచ్చారు. పుల్వామా ఘ‌ట‌న‌కు ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధం కావాలని  పిలుపునిచ్చారు. ``ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు మీకు అధికారం ఇస్తున్నా, మీరు సమయం - ప్రాంతం - భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకోండి‘ అని మోదీ స్పష్టంచేశారు. ఉగ్రవాదుల దాష్టీకానికి అంతకంతకూ ప్రతీకారం తీర్చుకుంటాం`` అని ఉద్ఘాటించారు.



Tags:    

Similar News