కొత్త అలవాటుకేసీఆర్ కు బాగానే పట్టేసిందండోయ్

Update: 2021-07-10 06:34 GMT
ఒక్కొక్కరి ఒక్కోలాంటి ఇమేజ్ ఉంటుంది. ఏళ్లుకు ఏళ్లుగా సాగే తీరుకు భిన్నంగా మార్పులు చోటు చేసుకోవటం ఆసక్తికరమే కాదు.. ఇలా కూడా జరుగుతుందా? అనిపిస్తుంటుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారును చూస్తే.. ఇదే సందేహం కలుగక మానదు. ఆయన్ను గుర్తుకు తెచ్చుకున్నంతనే ఆయనతోపాటు ఆయన ఫాంహౌస్ గుర్తుకు వస్తుంది. అన్నేసి రోజులు అక్కడే ఉంటారు కదా? మరి.. ఆయర అక్కడేం చేస్తారన్న దానిపై ఎవరూ సూటిగా చెప్పరు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన మంత్రులు సైతం.. ఫాంహౌస్ లో పెద్ద సారు యాక్టివిటీస్ ఏమేం ఉంటాయని చెబితే.. తమకు సమాచారం లేదని చెబుతారు. నిజానికి ఆ ఫాంహౌస్ ఒక పెద్ద ముచ్చటగా అభివర్ణించే వారంతా అసలేం జరుగుతుందో అర్థం కాదన్నమాట వినిపిస్తూ ఉంటుంది.

ఇదంతా ఎందుకంటే.. గతంలో ఫాంహౌస్ కి వెళితే.. రోజుల తరబడి అక్కడే ఉండిపోయేవారు కేసీఆర్. ప్రగతిభవన్ కు అప్పుడప్పుడు మాత్రమే వచ్చే ఆయన.. ఇటీవల కాలంలో తన తీరును మార్చుకున్నట్లుగా చెబుతారు. అలా అని..కేసీఆర్ ఫాంహౌస్ వెళ్లటం లేదని కాదు. వెళ్లినా.. వెంటనే వచ్చేస్తున్నారు. ఇదో కొత్త అలవాటుగా కేసీఆర్ ను దగ్గర నుంచి చూసే వారు చెబుతుంటారు.  అంతేకాదు.. గతంలో మంత్రివర్గ సమావేశాలకు ఫలానా సమయం అంటూ ఏమీ ఉండేది కాదు. ఆయనకు తోచినప్పుడు కాబినెట్ మీటింగ్ నిర్వహించేవారు. అది కూడా చాలా తక్కువగానే నిర్వహించేవారు.

అందుకు భిన్నంగా ఇటీవల కాలంలో ఆయనలో కొత్త మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తరచూ ఆయన మంత్రివర్గ సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. సెకండ్ వేవ్ వేళ.. లాక్ డౌన్ విధించినప్పుడు ప్రతి పది రోజులకు ఠంఛన్ గా మంత్రివర్గ భేటీ నిర్వహించటం.. తామంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నట్లుగా మంత్రివర్గ నిర్ణయాలు వెలువడేవి. గతంలో మూడు నెలలకు.. అప్పుడప్పుడు నాలుగైదు నెలలకు ఒకసారి కూడా భేటీ అయ్యే తీరుకు భిన్నంగా ఇటీవల కాలంలో తరచూ కాబినెట్ మీటింగ్ లు నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పించిన నాటి నుంచి ఈ అలవాటు మొదలైనట్లుగా చెబుతారు.

సాధారణంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వారు ప్రతి శాఖను రివ్యూ చేయటం.. కీలక నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. అయితే.. అన్ని శాఖల మీద రివ్యూ చేయటం.. ఒక క్రమపద్దతిలో వారం.. పది రోజుల్లో ఉన్న అన్ని శాఖల్ని.. ఆ శాఖాధిపతుల్ని పిలిపించి అసలేం జరుగుతుందన్నట్లుగా వ్యవహరిస్తారు. కేసీఆర్ అందుకు పూర్తి భిన్నమని చెప్పాలి.

ఆయనకు నచ్చినప్పుడు నచ్చిన శాఖను రివ్యూ చేస్తారు. గడిచిన ఏడేళ్లలో కొన్ని శాఖల్ని ఇప్పటి వరకు రివ్యూ చేసింది లేదని చెబుతారు. అయితే.. ఇటీవల కాలంలో ఆయనలో ఒక మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రగతిభవన్ లో పలు శాఖలకు సంబంధించిన రివ్యూల్ని ఆయన నిర్వహిస్తున్నారు. మరికొన్ని వారాల్లో తెలంగాణను తాకుతుందని అంచనా వేస్తున్న థర్డ్ వేవ్ మీద కేసీఆర్ తరచూ రివ్యూల్ని చేస్తున్నట్లు చెప్పాలి. ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన అప్డేట్ అవుతున్నట్లుగా చెబుతున్నారు.

ఈ మధ్యనే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించిన ఆయన.. తాజాగా మరో కాబినెట్ భేటీకి డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 13న మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. కాబినెట్ లో చర్చించాల్సిన విషయాలపై ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. కొత్త జోనల్ విధానం.. ఉద్యోగాల భర్తీ.. పదోన్నతులు.. క్రిష్ణా జలాల వినియోగంతో పాటు.. భూముల ధరల పెంపు పైనా నిర్ణయం.. కరోనా థర్డ్ వేవ్ సంసిద్ధత అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. గతంతో పోలిస్తే.. శాఖా పరమైన రివ్యూలకు ఎక్కువ సమయాన్ని సేకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా కేసీఆర్ లో కొత్త మార్పుకొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న మాట ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది.
Tags:    

Similar News