మోడీపై ‘అమ్మ’ అస్త్రాన్ని సంధించిన పంజాబ్ రైతు

Update: 2021-01-24 13:00 GMT
ఈ ప్రపంచంలో తల్లి మాటను కాదనే కొడుకులు చాలా అరుదు. అందునా ప్రధానమంత్రి మోడీ లాంటి వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి అంటే మహా ప్రేమ. ఆమె అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి మోడీకి.. తమ వేదనల గురించి.. బాధల గురించి.. డిమాండ్ల గురించి పంజాబ్ రైతు తాజాగా రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. మోడీ సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ.. కేంద్రం మాత్రం మొండితనంతోనే ఉంది.

రైతుల నిరసనలు.. ఆందోళనల్ని పట్టించుకోవటం లేదు. ఇలాంటివేళ.. మోడీ తల్లికి పంజాబ్ రైతు రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాల్సిందిగా మోడీకి నచ్చ జెప్పాలని.. ఆయన తల్లి హీరాబెన్ కు ఒక లేఖ రాశారు.

బరువెక్కిన మనసుతో తానీ లేఖ రాస్తున్నట్లుగా పేర్కొన్న సదరు రైతు.. ‘‘దేశానికి.. ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతలు మూడు నల్ల చట్టాల కారణంగా గడ్డ కట్టించే చలిలో గత్యంతరం లేక రోడ్ల పైనే నిద్ర పోతున్నారు. ఈ అభాగ్యుల్లో 90 నుంచి 95 ఏళ్ల వయోవృద్ధులు, పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. చలిగాలులతో వారంతా జబ్బున పడుతున్నారు. బలిదానాలకు సిద్ధమవుతున్నారు. ఇది తలుచుకుంటేనే మా మనసుల్ని తల్లడిల్లిపోతున్నాయి’’ అని పంజాబ్ కు చెందిన హర్ ప్రీత్ సింగ్ అనే రైతు రాసిన లేఖలో పేర్కొన్నారు.

వణికించే చలిలో.. నిరసన ప్రదేశం నుంచి తానీ లేఖ రాస్తున్నట్లు చెప్పారు. అదానీ.. అంబానీ.. ఇతర కార్పొరేట్ సంస్థల తరఫున తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాల కారణంగా తాము ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుత ఆందోళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘కొండంత ఆశతో ఈ లేఖ రాస్తున్నాం. మీ కుమారుడు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధాని. ఆయనే ఆమోదింపచేసిన సాగు చట్టాల్ని ఆయనే రద్దు చేయగలడు’ అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

తల్లి మాటను తోసిపుచ్చే కొడుకు ఎక్కడా ఉండడనే నమ్మకంతో తానీ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. తల్లి మాత్రమే కొడుకును శాసించగలరన్న ఆయన.. యావత్ దేశం మీకు ధన్యవాదాలు తెలియజేస్తుందన్నారు. ఇప్పుడీలేఖ సంచలనంగా మారింది. మరి.. దీనిపై ప్రధాని మోడీ.. ఆయన తల్లి ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.


Tags:    

Similar News