ఉచిత విద్యుత్ అక్కర్లేదు.. ఆ ఎమ్మెల్యే కావాలన్న యువతి

Update: 2021-08-01 03:59 GMT
నచ్చిన దాని గురించి చెప్పేయటానికి ఎవరూ మొహమాట పడటం లేదు. గతంలో మనసులోని మాట చెప్పేందుకు కిందా మీదా పడే పరిస్థితి. పరిచయస్తుడు.. మనసుకు నచ్చిన వాడికి సైతం.. నువ్వు నాకు నచ్చావ్ అన్న మాట చెప్పేందుకు చాలా ఇబ్బంది పడేవారు. మారిన కాలంలో అవన్నీ ఇప్పుడు ఎంత సింఫుల్ గా తయారయ్యాయనటానికి తాజా ఉదంతం ఒక నిదర్శనంగా చెప్పొచ్చు.

ఢిల్లీకి చెందిన ఎమ్మెల్యే ఒకరికి పంజాబ్ కు చెందిన యువతి వెరైటీగా ప్రపోజ్ చేసిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టుకు సదరు ఎమ్మెల్యే కూడా స్పందించటం.. వివాదానికి గురి కాకుండా.. సదరు పోస్టుతో తన ఇమేజ్ పెంచుకునేలా చేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. తన అధికారాన్ని మరిన్ని రాష్ట్రాలకు విస్తరించాలని తెగ తాపత్రయపడుతోంది. అయితే.. ఆ పార్టీ అనుకున్నట్లుగా ముందుకు వెళ్లలేకపోతోంది. చాలా సులువుగా.. ఢిల్లీలో అధికారాన్ని సొంతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి.. ఇతర రాష్ట్రాల్లో ఎంట్రీ ఇవ్వటం కూడా కష్టంగా మారింది. ప్రస్తుతం ఆ పార్టీ పంజాబ్ ను లక్ష్యంగా చేసుకుంది. త్వరలో ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పక్కా ప్లాన్ వేస్తూ.. కొత్త పథకాల్ని తెర మీదకు తీసుకొస్తోంది.

ఈ క్రమంలో ఒక కొత్త వరాన్ని అక్కడ ప్రకటించారు. ఆమ్ఆద్మీ పార్టీ పంజాబ్ లో విజయం సాధించి.. అధికారాన్ని చేపడితే.. తాము ఆ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ప్రవేశ పెడతామని ప్రకటించారు. ఈ పథకం అమలు కోసం పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ కోరింది. దీనికి సంబంధించి ఒక వ్యక్తి చేసిన పోస్టుకు.. పంజాబ్ కు చెందిన యువతి ఒకరు స్పందించారు. 'నాకు ఉచిత విద్యుద్ వద్దు. రాఘవ్ కావాలి' అంటూ ఆమ్ ఆద్మీ పార్టీలో అత్యంత పిన్న వయస్కుడై ఎమ్మెల్యే కమ్ అందగాడైన రాఘవ్ చద్దా గురించి ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 32 ఏళ్ల రాఘవ్ చద్దా ఢిల్లీలోని రాజేందర్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసి.. అందులో సదరు యువతి వివరాల్ని కనిపించకుండా జాగ్రత్తలు తీసుకొని ఇన్ స్టాలో పోస్టు చేశాడీ ఎమ్మెల్యే.

ఆ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇన్ స్టాలో పెట్టిన పోస్టులో 'కేజ్రీవాల్ గ్యారెంటీ' అంటూ కాస్తంత కొంటెగా సమాధానం ఇచ్చాడు. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రస్తుతం 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరింత దూకుడ్ని ప్రదర్శించి అధికారాన్ని సొంతం చేసుకోవాలన్నది కేజ్రీవాల్ లక్ష్యంగా చెబుతారు. ఇందులో భాగంగా ఎలాగైనా 55 స్థానాల్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉచిత విద్యుత్ హామీని తెర మీదకు తీసుకొచ్చారు.

ఉచిత విద్యుత్ వద్దు.. రాఘవ్ కావాలంటూ పంజాబ్ యువతి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ కు రాఘవ్ బదులిస్తూ.. 'పార్టీ మేనిఫెస్టోలో నేను లేను. ఉచిత విద్యుత్ మాత్రమే ఉంది. కావాలంటే పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వచ్చాక మీ ఇంటికి ఉచితంగా నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేట్లు చూస్తాలే' అని బదులిచ్చారు. అయితే.. రాఘవ్ రిప్లై తర్వాత సదరు యువతి తన ట్వీట్ ను ట్విటర్ నుంచి తొలగించింది. ఏమైనా..ఆప్ ఎమ్మెల్యే కు సరదాగా ప్రపోజ్ చేసిన యువతి వ్యహారం అందరిని ఆకర్షిస్తోంది.
Tags:    

Similar News