ఉన్న కాస్త పేరును నిలుపుకోవా చిన్న‌మ్మ‌?

Update: 2018-03-10 04:55 GMT
ఎన్టీవోడి కుమార్తెగా ప‌రిచ‌య‌మైన పురంధేశ్వ‌రి.. రాజ‌కీయ నాయ‌కురాలిగా మారిన త‌ర్వాత ఆమెను తెలుగు ప్ర‌జ‌లు అందునా ఏపీ ప్ర‌జ‌లు ఎంత‌గా ఆద‌రించారో.. మ‌రెంత‌గా అభిమానించారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎక్క‌డ నిల‌బ‌డినా.. ఆమెను గెలిపించారు. 2014లో నెల‌కొన్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల కార‌ణంగా ఆమె ఓడిపోయారే త‌ప్పించి.వాస్త‌వానికి ఆమె గెలుపు ఖాయం.

విభ‌జ‌న ఎపిసోడ్ లో కేంద్ర‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ఆమె.. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం ఏమీ చేయ‌లేక‌పోయార‌న్న ఆగ్ర‌హం ఎన్నిక‌ల్లో ఆమె ఓట‌మికి కార‌ణంగా చెప్పాలి. త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు త‌ప్పించి.. ఏపీ ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాల‌న్న భావ‌న ఆమె మాట‌ల్లోనూ.. చేత‌ల్లోనూ లేక‌పోవటంపై ఆంధ్రోళ్ల‌కు ఆమెపై ఆగ్ర‌హం అంత‌కంత‌కూ పెరుగుతోంది.

విభ‌జ‌న వేళ‌.. ఏపీ మొత్తం ర‌గిలిపోతుంటే.. పురంధేశ్వ‌రి మాత్రం కేంద్ర‌మంత్రి ప‌ద‌విలోనే ఉండిపోయారు. త‌న సొంత ప్ర‌జ‌ల‌కు తీర‌ని న‌ష్టం జ‌రుగుతున్నా ఆమెకు ప‌ట్ట‌లేద‌న్న మ‌చ్చ ఆమె మీద ఉండిపోయింది. కాంగ్రెస్ పార్టీలో చివ‌రి నిమిషం వ‌ర‌కూ ఉండి.. ఎన్నిక‌ల వేళ అక‌స్మాత్తుగా బీజేపీలోకి వెళ్లిపోయారు. విభ‌జ‌న వేళ‌లో కాంగ్రెస్ లో ఉన్నా.. ఏపీ ప్ర‌జ‌ల కోసం పోరాడి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేది. కానీ.. కాంగ్రెస్ అధినాయ‌క‌త్వానికి వీర విధేయురాలిగా నిలిచి.. చివ‌ర్లో త‌న ప‌ద‌వి కోసం పార్టీ మారిన వైనం చాలామందికి న‌చ్చ‌లేదు. దీని ఫ‌లిత‌మే ఆమె ఓట‌మి.

విభ‌జ‌న ముందు వ‌ర‌కూ పురంధేశ్వ‌రి ఎక్క‌డ బ‌రిలోకి నిలిచినా.. ఆమెను ఎన్టోవోడి కుమార్తెగా చూసి.. మ‌రో ఆలోచ‌న లేకుండా ఓటేశారు. కానీ.. విభ‌జ‌న వేళ ఆమో ఇచ్చిన థోకాకు మాత్రం ఆంధ్రోళ్లు త‌మ ఆగ్ర‌హాన్ని ఓటుతో చెప్పేశారు. అయిన‌ప్ప‌టికీ చిన్న‌మ్మ‌గా అంద‌రూ పిలుచుకునే ఆమెలో కించిత్ మార్పు లేద‌న్న అభిప్రాయం పెద్ద ఎత్తున వ్య‌క్త‌మవుతోంది. విభ‌జ‌న హామీల్ని అమ‌లు చేస్తామ‌ని మోడీ స్వ‌యంగా చెప్పినా.. ప్రధాని హోదాలో ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోని తీరుపై ఆంధ్రోళ్ల‌లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. కేంద్రానికి వీర విధేయురాలిగా ఆమె మాట‌లు మ‌రింత మంట పుట్టేలా చేస్తున్నాయి. తాజాగా చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల వేళ‌.. ఆమె మాట‌లు మ‌రింత ఒళ్లు మండేలా ఉన్నాయి.

ఓప‌క్క నిధుల కేటాయింపులో వివ‌క్షతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విష‌యం అంకెల సాక్షిగా అర్థ‌మ‌వుతున్నా.. చిన్న‌మ్మ మాత్రం ఏపీకి నిధులు ఇవ్వ‌మ‌ని కేంద్రం ఎప్పుడైనా చెప్పిందా? అని ప్ర‌శ్నిస్తున్నారు. తాను కేంద్ర మాన‌వ వ‌న‌రుల మంత్రిగా ఉన్న‌ప్పుడు రంగారెడ్డి జిల్లాకు ఐఐటీని తీసుకురావ‌టానికి నాలుగైదేళ్లు ప‌ట్టింద‌ని.. కానీ ఏపీకి ఒకేసారి 11 విద్యాసంస్థ‌లు వ‌చ్చిన‌ట్లుగా చెప్పి..ఆ గొప్ప‌త‌న‌మంతా మోడీకి క‌ట్ట‌బెట్టే ప్ర‌య‌త్నం చేశారు.

కానీ..11 విద్యాసంస్థ‌లు ఇప్పుడు ఎలా ఉన్నాయి?  గ‌డిచిన నాలుగేళ్ల‌లో వాటి అభివృద్ధి ఎంత మేర జ‌రిగింది? అన్న విష‌యాన్ని కూడా ఆమె చెబితే బాగుండేది. కానీ.. ఇవేమీ చెప్ప‌కుండా కేవ‌లం కేంద్రానికి ద‌న్నుగా మాట్లాడ‌ట‌మే ధ్యేయమ‌న్న‌ట్లుగా చిన్న‌మ్మ తీరు చూసిన‌ప్పుడు.. ఆమె మీద ఆంధ్రోళ్ల‌కు మిగిలిన గౌర‌వాన్ని ఆమె మిగుల్చుకునేట‌ట్లు క‌నిపించ‌ట్లేద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. బీకేర్ ఫుల్ చిన్న‌మ్మా..?
Tags:    

Similar News