ఆ దేశంలో హాట్ టాపిక్ గా ‘రాణి’.. ఎందుకంట స్పెషల్ అంటే?

Update: 2021-07-08 23:30 GMT
పేరు ‘రాణి’. వయసు 23 నెలలు మాత్రమే. అంటే.. రెండేళ్లు నిండటానికి మరో నెల పడుతుంది. అలాంటి ఈ రాణిని చూసేందుకు బంగ్లాదేశ్ లోని ప్రజలు పోటెత్తుతున్నారు. దాన్ని దగ్గరగా చూసేందుకు.. దాన్ని తమ సెల్ కెమెరాల్లో బంధించేందుకు మక్కువ చూపుతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను సైతం లైట్ తీసుకొని మరీ దాన్ని చూసేందుకు వస్తున్న వారి వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడా దేశంలో ‘రాణి’ సోషల్ మీడియా సెలబ్రిటీగా మారింది.

ఇంతకీ ఈ రాణి ఎవరు? దాని ప్రత్యేకత ఏమంటారా? ఇప్పటివరకు చెప్పుకున్న రాణి మనిషి కాదు. బుజ్జి ఆవు. దీని ప్రత్యేకత ఏమంటే? ఇది మరుగుజ్జు ఆవు. ఇలాంటి ప్రపంచంలో మరెక్కడా లేదంటున్నారు. 23 నెలల రాణి ఎత్తు ఎంతో తెలుసా? కేవలం 51 సెంటీమీటర్లు. మరింత బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే.. మేక కంటే తక్కువ హైట్. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు దగ్గర్లోని చారిగ్రామ్ కు చెందిన హాసన్ హవాల్ దార్ అనే వ్యక్తి రాణిని పెంచుకుంటున్నాడు.

ప్రపంచంలో అత్యంత పొట్టి ఆవుగా ఇదిప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. దీని పుణ్యమా అని.. ఏడాదిన్నర నుంచి వణికిస్తున్న కరోనాను సైతం లైట్ తీసుకొని.. దీన్ని చూసేందుకు జనాలు క్యూ కడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్న ప్రజలు.. దీన్ని అపురూపంగా చూసుకోవటమే కాదు.. దీన్ని ఫోటోలు తీసుకునేందుకు తెగ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో.. రాణి పుణ్యమా అని ఆ ఊరు ఇప్పుడు ఫేమస్ అయిపోయింది.

ఇదిలా ఉంటే ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత పొట్టి ఆవుగా రికార్డు కేరళకు చెందిన మాణిక్యం అనే ఆవు ఉంది. రాణి పుణ్యమా అని దాని రికార్డు బ్రేక్ కానుంది. ఎందుకంటే.. మాణిక్యం కంటే 10 సెంటీమీటర్లు పొట్టిగా ఉండటమే దీనికి కారణం. కేవలం మూడు రోజుల వ్యవధిలో 1500 మంది రాణిని చూడటానికి వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీని ప్రత్యేకత గురించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని సంప్రదించామని.. మూడునెలల్లో నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పినట్లుగా పేర్కొన్నారు.
Tags:    

Similar News