నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ మనసులో మాట బయటపెట్టారు. పూణేలో జగతిక్ మరాఠీ అకాడమీ చేపట్టిన ఓ కార్యక్రమంలో ఓపెన్ ఇంటర్వ్యూ పేరుతో మహరాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎంఎన్ ఎస్) అధినేత రాజ్ థాకరే శరద్ పవార్ పై పలు ప్రశ్నలు సంధించారు. వీటి గురించి ఆసక్తికరంగా మాట్లాడిన పవార్ రాహుల్ గాంధీ భజన చేశారు. అయితే ఈ భజన రాహుల్ గాంధీ జాతీయ అధ్యక్షుడిగా పట్టాభిషేకం జరిగిన నాటి నుంచి కొనసాగుతూనే ఉంది. దీనికి కారణం లేకపోలేదు. ఓ వైపు రాహుల్ మోసేస్తూ ..మరోవైపు అతని తల్లి సోనియాగాంధీని ఇరకాటంలో పెట్టేలా మాట్లాడారు. మొత్తానికి ఈ ఓపెన్ ఇంటర్వ్యూ ఆసక్తికరంగా సాగడంతో పవార్ భవిష్యత్ రాజకీయాల గురించి చర్చిస్తున్నారు.
1999లో శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ వచ్చారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీని విభేదిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ తో జతకట్టేందుకు పవార్ సిద్ధమయ్యారు. రాహుల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రధానిగా తన చిరకాల కోరికను తీర్చుకునే పనిలో పడ్డారు. అయితే ఈ కోరిక ఇప్పటిది కాదు. 1999నాటి నుంచి పవార్ కు ప్రధాని కావాలనే కోరిక బలీయంగా ఉంది.
అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ప్రధానిపదవికి శరద్ పవార్ పోటీ పడ్డారు . కానీ మీడియా ద్వారా సోనియా ఆ పదవికి కోరుతున్నట్లు పవార్ కి తెలిసింది. దీంతో అప్పటి వరకు కాంగ్రెస్ మిత్రపక్షంగా వ్యవహరించిన పవార్ నుంచి కాంగ్రెస్ ను విభేదిస్తు వస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు కలిసి ఓ మహా కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ కూటమికి శరద్ పవార్ నాయకత్వం వహించేలా 'సంవిధాన్ బచావో' ర్యాలీ ని కూడా నిర్వహించారు. ఆ ర్యాలీకి సీపీఎం-సీపీఐ-జేడీయూలను స్వయంగా ఆహ్వానించారు. కానీ రాహుల్ గాంధీని స్వయం గా ఆహ్వానించారో లేదో తెలియరాలేదు.
కానీ శరద్ పవార్ చేస్తున్న రాజకీయం నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మింగుడు పడేది కాదు. కేంద్రంలో బీజేపీ- శివసేన కూటమిగా ఉన్నాయి. అయితే ఆ కూటమి నుంచి బీజేపీ తప్పుకోవడంతో కమలానికి మద్దతుగా ఎన్సీపీ అధినేత పవార్ సిద్ధమయ్యారు.
అలాంటి ఇప్పడు శరద్ పవార్ బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసి దానికి నాయకత్వం ఎందుకు వహిస్తున్నారన్నది సోనియా వాదన
దీనికి తోడు గుజరాత్ అసెంబ్లీ - మహరాష్ట్రలో జరిగిన గత ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ - ఎన్సీపీలు విడివిడిగా పోటీ చేశాయి. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ఆందోళన నిర్వహించడానికి, 2017లో రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు సోనియా గాంధీ ప్రతిపక్షాలను సమీకరించినప్పుడు శరద్ పవార్ హాజరయ్యారు. కానీ గత ఆగస్టులో నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశానికి మాత్రం శరద్ పవాద్ హాజరు కాలేదు. ఆ తర్వాత అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేసినప్పుడు ఎన్‌సీపీ ఓటేయలేదు.
అలా ఎన్సీపీ- కాంగ్రెస్ మధ్య వైరం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పుణేలో బహిరంగ వేదికపై సోనియా గాంధీపై అక్కసు వెళ్ల గక్కారు శరద్ పవార్. 1999లో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తానే ప్రధాన మంత్రినవుతానని సోనియాగాంధీ మీడియా ద్వారా తనకు తెలిసిందన్నారు. ఆమె కంటే ముందు ఆ పదవికి తాను కానీ, మన్మోహన్ సింగ్ కానీ సరైన అభ్యర్థులమని చెప్పామని అన్నారు. ఎప్పుడైతే ప్రధాని పదవికి కోసం సోనియా కోరుకున్న విషయం తెలిసిందో తాను కాంగ్రెస్ ను వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని అన్నారు. అధ్యక్షుడి రాహుల్ గాంధీ పార్టీకి పునరుజ్జీవం పొందుతుందని అన్నారు. అంతేకాదు రాహుల్ గాంధీలో నాయకత్వలక్షణాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయని సూచించారు. ఆయన ప్రజలతో మమేకమవుతున్న తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో మార్పు కనబడుతుందని చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా పీఎం మోడీ చేసిన వ్యక్తిగత ఆరోపణల్ని దుయ్యబట్టారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతారహితంగా మాట్లాడడం సరైన పద్దతి కాదని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకు కూడా ఎన్సీపీ సిద్ధమేనంటూ శరద్ పవార్ సూచనప్రాయంగా తెలిపారు. మహారాష్ట్రలో భావసారూప్యం కలిగిన ఇతర పార్టీలను కూడా తమ కూటమిలో కలుపుకుని 2019 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు యోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.