అచ్చంగా...రఘురామ రూట్లో పెద్దాయన... ?

Update: 2022-02-18 00:30 GMT
ఒక రాజకీయ పార్టీలో అందరూ హ్యాపీగా ఉంటారు అనుకుంటే పొరపాటే. అధినాయకత్వం తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చాలని లేదు, అయితే మెజారిటీ నేతలు సర్దుకుపోతారు.

మనకెందుకులే ఈ గోడూ గొడవా అని అలా తమ పని తాము చేసుకునే బాపతే ఎక్కువ. కొందరు మాత్రమే గట్టిగా నిలదీస్తారు. ఇదేమి తీరు అని ప్రశ్నిస్తారు. అలాంటి వారు మాత్రం హై కమాండ్ కి కొరకరాని కొయ్యగా మారుతారు.

వైసీపీలో తీసుకుంటే పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే రఘురామ క్రిష్ణం రాజు అలాగే అధినాయకత్వం కంట్లో నలుసుగా మారారు. హై కమాండ్ తీరు మీద ఆయన తన నిరసన గళం వినిపించి అలా తనదైన శైలిలో ముందుకు సాగారనే చెప్పాలి. ఒక విధంగా అది సాహసం అని కూడా అంటారు.

బలమైన నాయకుడు. బలమైన ప్రభుత్వం దాన్నిఎదిరించి నిలబడడం అంటే కష్టమే. కానీ రఘురామ తన స్పెషాలిటీని అలా చాటుకుంటే మూడేళ్ళ ఎంపీగా కొనసాగుతున్నారు.

ఇపుడు అదే వైసీపీలో మరో రఘురామ  ఉన్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన ఎవరో కాదు, నెల్లూరు పెద్దాయనగా అంతా చెప్పుకునే మాజీ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. ఆయన వైసీపీ ప్రభుత్వ విధానాల మీద చాలా కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు

అదే టైమ్ లో ఆయన అధికారులను విమర్శిస్తూ పలు మార్లు వార్తలకు ఎక్కారు. అయితే ఈసారి ఆయన గొంతు మరింత గట్టిగా సౌండ్ ఇస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు మీద రఘురామ గరం గరం అవుతున్నారు.

ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి శ్రీ బాలాజీ జిల్లాలో కలిపేశారు. దాంతో ఆనం వారి ఆవేశం కట్టలు తెంచుకుంటోంది.

ఒక విధంగా ధిక్కార స్వరమే వినిపిస్తున్నారు. ఎవరిని అడిగి జిల్లాలను విభజించారు అంటూ ఆనం గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కొత్త జిల్లాల విభజన సహేతకంగా జరగలేదని, దీని వల్ల రైతులు ఇబ్బంది పడతారని, అలాగే సాగు నీటి ప్రాజెక్టుల వద్ద కొట్లాటలు కూడా జరుగుతాయని కామెంట్స్ చేశారు.

ఒక విధంగా ఉన్నతాధికారుల మీద ఆనం విరుచుకుపడినా ప్రతీ మాట కూడా అధినాయకత్వం  మీదనే అని అర్ధమైపోతోంది. ఇక ఆనం ఇంతలా నోరు చేసుకున్నా ఆయనకు జవాబు ఇవ్వవద్దని వైసీపీ హై కమాండ్ నుంచి నెల్లూరు జిల్లా నేతలకు ఆదేశాలు వెళ్ళినట్లుగా చెబుతున్నారు. ఆనంని ఒక విధంగా లైట్ గా తీసుకోవాలనే హై కమాండ్ ఇప్పటికి డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.

అదే సమయంలో ఆనం కనుక మరిన్ని మార్లు హాట్ కామెంట్స్ చేసినా అధినాయకత్వాన్ని ధిక్కరించినా కూడా అపుడు చూడవచ్చు అన్నది వైసీపీ పెద్దల ఆలోచనగా ఉందిట.

ఇక ఆనం తీరు చూస్తే ఆయన తనకు మంత్రి పదవి రాదు అని పక్కాగా ఫిక్స్ అయిపోయారు అంటున్నారు. దాంతో హై కమాండ్ ని నిందించి అయినా వేటు వేయించుకుని మరీ సింపతీ పొందాలని చూస్తున్నారని, ఆ విధంగా తాను వైసీపీలో రెబెల్ ఎమ్మెల్యేగా మారాలని అనుకుంటున్నారు అని అంటున్నారు.

అంటే రఘురామ క్రిష్ణం రాజు తరహాలో ఇక మీదట ప్రతీ రోజూ ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ అధినాయకత్వాన్ని ఎండగట్టాలన్న వ్యూహమేదో ఉందని అనుమానిస్తున్నారు.

మరి రఘురామ మాదిరిగా ఆనం కూడా రివర్స్ అయితే వైసీపీ హై కమాండ్ ఏం చేస్తుంది అన్నది చూడాలి. మొత్తానికి రఘురామ బాటలో నెల్లూరు పెద్దాయన నడవడం మాత్రం ఒక విధంగా షాకింగ్ కాదు కానీ ఆసక్తికరంగానే రాజకీయాల్లో ఉందని అంటున్నారు.
Tags:    

Similar News