తిట్టిన నోటితోనే పొగ‌డ‌టం..ఏపీ నేత‌ల‌కు సంక‌టం

Update: 2018-12-01 16:23 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు చెందిన నేత‌ల‌కు కొత్త స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. తాము తిట్టిన నోటితోనే ప్ర‌శంస‌లు గుప్పించాల్సిన ప‌రిస్థితిని ఆ నేత‌లు ఎదుర్కుంటున్నారు. ఓ వైపు పార్టీ ఆదేశాల‌ను స‌మ‌ర్థించ‌లేక మ‌రోవైపు క్షేత్ర‌స్థాయిలో ప‌రాభవాల‌ను ఎదుర్కోలేక క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుతున్నారు. ఇలాంటి సంక‌ట స్థితిని ఎదుర్కుంటున్న‌ది ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలు. కొద్దికాలం క్రితం దుమ్మెత్తిపోసిన ఏపీ కాంగ్రెస్ నేత‌లు తాజాగా ఐక్య‌త రాగం ఆల‌పిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కుదుర్చుకున్న పొత్తు వారికి చిత్ర‌మైన ప‌రిస్థితిని క‌ల్పిస్తోంది.

తెలంగాణ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ త‌మ రాజ‌కీయ సిద్ధాంతాల‌ను తుంగ‌లో తొక్కి సైతం - తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. కూట‌మి పేరుతో టీడీపీ - సీపీఐ - టీజేఎస్‌ ల‌తో జ‌ట్టుక‌ట్టాయి. ఉమ్మ‌డిగా ప్ర‌చారం చేస్తున్నాయి. ఇలా చేస్తున్న ప్ర‌చారంలో ఇప్ప‌టికే ఆయా పార్టీల నేత‌లు క్షేత్ర‌స్థాయిలో క‌లియ‌తిరుగుతున్నారు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు ఏపీ నేత‌లు సైతం రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధ‌మైంది. ఈ మేర‌కు పార్టీ నేత‌ల‌కు స‌మాచారం ఇచ్చింది. తాజాగా ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు రఘువీరారెడ్డి హైద‌రాబాద్‌ లో ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు.
ఏఐసీసీ ఆదేశాల మేరకు మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆహ్వానం మేరకు తెలంగాణ లో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణలో ఎన్నిక‌లను త‌మ సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలుగా ప్రచారం చేస్తామ‌ని ఆయ‌న వివ‌రించారు. పరిపాలనకు మాత్రమే రాష్ట్రాలు వేరు - కానీ అందరం తెలుగువాళ్ళమేన‌ని అన్నారు. ప్ర‌జా కూట‌మి మ్యానిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు. తెలంగాణ వారందరికీ ప్రజాకూటమిని గెలిపించమని విజ్ఞప్తి చేస్తున్నామ‌న్నారు. కాగా, కాంగ్రెస్ నేత‌లు టీడీపీ నాయ‌కులు బ‌రిలో దిగిన చోట కూడా ప్ర‌చారం చేస్తారా?  లేక కేవ‌లం త‌మ అభ్య‌ర్థుల వ‌ర‌కే ప‌రిమితం అవుతారా వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News