ఇప్పుడు ఎక్కడ చూసినా ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంపైనే చర్చ జరుగుతోంది. అధికార టీడీపీ - విపక్ష వైసీపీ - రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ - వామపక్షాలు - ప్రజా సంఘాలు... అన్ని కూడా ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఏపీ నేతలు మాత్రమే ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని - ఇప్పటికే ప్రత్యేక హోదా కంటే కూడా అధికమైన మేళ్లు చేశామని చెబుతున్నారు. రాష్ట్ర విభజన పాపం కారణంగా గడచిన ఎన్నికల్లో నవ్యాంధ్రలో సింగిల్ సీటు కూడా దక్కని కాంగ్రెస్ పార్టీ నిన్నటిదాకా ఓ మోస్తరు నిరసనలు తెలపగా... ఇప్పుడు టీడీపీ - వైసీపీ రంగంలోకి దిగిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అడ్రెస్ లేకుండా పోయారనే చెప్పాలి. అయినా కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాల కారణంగానే అన్యాయంగా రాష్ట్ర విభజన జరిగిందని, ఈ కారణంగా అన్ని వనరులు ఉన్నా నవ్యాంధ్రప్రదేశ్ అష్టకష్టాలు పడుతోందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. అయితే తామేమీ ఏపీకి అన్యాయం చేయలేదని, 2014లోనూ తాము అధికారంలోకి వచ్చి ఉంటే... ఏపీ ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుండేదన్న రీతిలో పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరారెడ్డి బడాయి పోతున్నారు.
అంతేకాదండోయ్... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ వస్తుందన్న భావనతో బీజేపీ - టీడీపీలు హోదాకు నో చెబుతున్నాయని ఓ వింత వ్యాఖ్య చేశారు. వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... రఘువీరా అదేమీ పట్టించుకోకుండా తనదైన స్టైల్లో చెప్పుకుంటూ వెళ్లిపోయారు. అయినా రఘువీరా ఏమన్నారన్న విషయానికి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుందని భావించిన టీడీపీ - బీజేపీలు రెండూ కుట్ర చేశాయని - నాలుగేళ్లు కలిసి ఉన్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని రఘువీరా విమర్శించారు. నాడు తాడేపల్లిగూడెం లో అమిత్ షా రూ.1.40లక్షల కోట్ల లెక్కలు చెప్పినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాల్సిందని, ఈరోజు చంద్రబాబు స్పందించినప్పటికీ విశ్వసనీయత లేదని విమర్శించారు. మోదీ - అమిత్ షా లిద్దరూ అబద్ధాల కోరులేనని వారికీ విశ్వసనీయత లేదని అన్నారు. మొత్తంగా మోదీ - షా - బాబులలో ఏ ఒక్కరికీ విశ్వసనీయత లేదని ఆయన ఆరోపించారు. ఏపీ విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్ట పోయింది కానీ, ఆంధ్రప్రదేశ్ కు అన్నివిధాలా న్యాయం చేసేందుకు ప్రయత్నించిందని, ఐదేళ్లు ప్రత్యేక హోదా - నాటి ప్రధాని మన్మోహన్ హామీలు - ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలన్నీ అమలైతే సుమారు 5 లక్షల కోట్ల విలువైన ప్రయోజనాలు ఏపీకి లభిస్తాయని అన్నారు.
ఏపీకి కాంగ్రెస్ వడ్డించిన విస్తరి ఇస్తే - దాన్ని బీజేపీ - టీడీపీలు రాజకీయ అవకాశవాద రాజకీయాల కోసం కుక్కలు చింపిన విస్తరి లా తయారుచేశారని రఘువీరా మండిపడ్డారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ దెబ్బతీస్తే, ఐదు కోట్ల ప్రజల హోదా హక్కును, ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర చంద్రబాబు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి అన్యాయం జరగడానికి బాధ్యులైన మోదీ - చంద్రబాబలు లిద్దరూ కాంగ్రెస్ పార్టీ ఇంకా నిందలు వేస్తూ పబ్బంగడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. అసత్యాల అమిత్ షా - మోసకారి మోదీ - వెన్నుపోటు చంద్రబాబు... వీరంతా ఏపీని ముంచినోళ్లేనని తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని - ‘హోదా’ అమలు కోసం పోరాటం మొదలు పెట్టింది కూడా తమ పార్టీయేనని, 2019లో ఆ ‘హోదా’ను అమలు చేసేది కాంగ్రెస్ పార్టీయేనని రఘువీరారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా టీడీపీ - బీజేపీ రెండు పార్టీలను తనదైన స్టైల్లో వేసుకున్న రఘువీరా తమ పార్టీ చేసిన అన్యాయాన్ని మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం.