రాహుల్ వ‌చ్చి బాబు బీపీ పెంచేస్తాడ‌ట‌

Update: 2017-07-04 06:11 GMT
రాష్ట్రంలో సంచలనం కలిగించిన పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు సాంఘిక బహిష్కరణ అంశం జాతీయ స్థాయిలో క‌ల‌కలం రేకెత్తె ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలోని కీల‌క నేత‌లు ప‌ర్య‌టించగా త్వ‌ర‌లో కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక్క‌డ ప‌ర్య‌టించే అవ‌కాశం ఉందంటున్నారు. ఈ అంశంపై ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల నేతలు గ్రామాన్ని సందర్శించిన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేడు గ్రామాన్ని సందర్శించనున్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు ఆలిండియా ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు తదితరులు ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో రాహుల్ టూర్ ఖాయ‌మ‌ని అంటున్నారు. మరోపక్క దళిత - అంబేద్కర్ సంఘాలు ఈ వెలి అంశం పై చలో ఢిల్లీ కార్యక్రమానికి సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గ‌ర‌గ‌ప‌ర్రు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం నెలకొల్పే విషయమై ఏర్పడిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఈ వివాదం నేపథ్యంలో తమను సాంఘిక బహిష్కరణ చేశారని దళితులు ఆరోపిస్తూ - ఆందోళనకు దిగగా - ఇదంతా కల్పితమని మరో వర్గం ఆందోళనలు చేస్తోంది. దీనితో కొద్ది రోజులుగా గ్రామాన్ని వివిధ పార్టీల నేతలు సందర్శించడం ప్రారంభించారు. బీజేపీకి చెందిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కే రాములు తొలిసారిగా అక్కడకు వచ్చి బహిరంగ విచారణ చేసి బహిష్కరణకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చెయ్యాలని ఆదేశాలు జారీచేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లా మంత్రి జవహర్ - సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు - రాష్ట్ర ఎస్సీ - ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ - ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు గ్రామాన్ని సందర్శించి, వెలి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్బంగా తహశీల్దార్ - ఎస్సైలను సస్పెండ్ చెయ్యడంతో పాటు గ్రామ సర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దుచేశారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గరగపర్రు గ్రామంలోని రెండు వర్గాలను కలిసిమెలసి ఉండటానికి ఒక కమిటీ ఏర్పాటుచేశారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం - బీజేపీ నిజనిర్ధారణ కమిటీ పేరుతో ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు దారా సాంబయ్య - నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు గ్రామంలో పర్యటించారు. ఇక తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు సైతం ఇక్క‌డ ప‌ర్య‌టించారు. మొత్తం మీద గరగపర్రు వెలి అంశం ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారిందని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News