కొత్త యాంగిల్ చూపించిన మౌన‌సింగ్‌

Update: 2017-12-04 09:25 GMT
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇంకా రాహుల్ గాంధీ ప‌గ్గాలు చేప‌ట్ట‌క‌ముందే...ఆయ‌న‌కు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. స‌హ‌జంగానే పూర్తికాలం రాజ‌కీయాల్లో ఉన్న కాంగ్రెస్ నేతలంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అనూహ్య‌రీతిలో మాజీ ప్ర‌ధాన‌మంత్రి మన్మోహ‌న్‌ సింగ్ సైతం రాహుల్ ప‌గ్గాలు చేప‌ట్ట‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అంతేకాదు ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ కూడా చేశారు. కాంగ్రెస్‌ కు రాహుల్‌ గాంధీ డార్లింగ్‌ అని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. పార్టీ సత్సంప్రదాయాలను కొనసాగించే సామర్థ్యం రాహుల్‌కు ఉందని ఆయన చెప్పారు. ఆయ‌న హయాంలో పార్టీ మ‌రింత ముందుకు సాగుతుంద‌ని ఆకాక్షించారు.

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ఆ పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కంగ్రాట్స్ రాహుల్ అంటూ అనేక మంది ట్వీట్లతో విషెస్ చెబుతున్నారు. ప‌లువురు మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంతో గౌరవప్రదమైన పార్టీ అని ఆ పార్టీ సీనియర్‌ నాయకురాలు అంబికా సోనీ అన్నారు. పార్టీ సిద్ధాంతాలను తాము పాటిస్తామని, వాటిని పరిరక్షిస్తామని ఆమె చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ నామినేషన్‌ దాఖలు చేయడంపై ఆ పార్టీ సీనియర్‌ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ నామినేషన్‌ పట్ల పార్టీలో అంతర్గతంగా సంతోషం వెల్లివిరుస్తోందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ అన్నారు. కాంగ్రెస్‌ అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించే అధికారం ప్రధాని నరేంద్ర మోడీకి లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నిక స్వేచ్ఛగా - ప్రజాస్వామ్యయుతంగా జరుగుతోందని ఆయన చెప్పారు. పార్టీ సభ్యులు ఎవరు పోటీ చేయాలనుకున్నా చేయవచ్చునని ఆయన అన్నారు.

కాగా, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ల‌ నామినేషన్లను రాహుల్ దాఖలు చేశారు. ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌లో ఆయన తన నామినేషన్‌ ను దాఖలు చేశారు. రాహుల్ అభ్యర్థిత్వాన్ని సోనియా గాంధీ - మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ - సీనియర్ నేతలు ప్రతిపాదించారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 11 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో నామినేష‌న్  దాఖలు గడువు ముగిసిపోయింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ఎన్నికైనట్లు సాయంత్రానికి ఏఐసీసీ ప్రకటన జారీచేసే అవకాశం ఉంది.

కాగా, 19 ఏళ్లుగా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగిన తల్లి సోనియాగాంధీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధమైంది. వివిధ రాష్ర్టాల పీసీసీలకు 90 సెట్ల నామినేషన్ పత్రాలు పంపామని, కానీ ఇప్పటివరకు ఒక్క సెట్ కూడా తమ వద్దకు చేరలేదని ఏఐసీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముళ్లపల్లి రామచంద్రన్ చెప్పారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలులో సోనియాగాంధీ - మన్మోహన్ సింగ్ - గులాంనబీ ఆజాద్ - ఏకే ఆంటోనీ - అహ్మద్ పటేల్ - పార్టీ పాలిత రాష్ర్టాల సీఎంలు నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో వివిధ రాష్ర్టాల కాంగ్రెస్ ప్రతినిధి బృందాలు కూడా రాహుల్‌ ను పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. రాహుల్‌ కు మద్దతుగా పార్టీ ప్రధాన కార్యదర్శులు - వర్కింగ్ కమిటీ సభ్యులు - రాష్ర్టాల పీసీసీలు - అనుబంధ సంస్థలు వేర్వేరుగా నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తాయని ఏఐసీసీ కమ్యూనికేషన్స్ ఇన్‌ చార్జీ రణ్‌ దీప్ సూర్జేవాలా తెలిపారు.
Tags:    

Similar News