రాహుల్ సంధించిన భారీ జ‌నాక‌ర్ష‌ణ అస్త్రం!

Update: 2019-03-26 05:29 GMT
ఎన్నిక‌ల వేళ జనాక‌ర్ష‌ణ ప‌థ‌కాల్ని తెర మీద‌కు తీసుకురావ‌టం మామూలే. స‌మాజంలోని పేద వ‌ర్గాల్ని ఆదుకునేందుకు డ‌బ్బును పంచ‌టం అల‌వాటుగా మార్చుకున్న రాజ‌కీయ పార్టీలు.. ఇటీవ‌ల కాలంలో డ‌బ్బును నేరుగా ల‌బ్థాదారుల బ్యాంకు ఖాతాల‌కు వేయ‌టం ద్వారా వారి మ‌న‌సుల్ని దోచుకోవాల‌ని.. వారి ఓట్ల‌తో అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

రైతుల్ని ఆదుకునేందుకు ఏడాదికి ఎక‌రానికి రూ.8 వేలు చొప్పున (రెండు ద‌ఫాలుగా) ఇచ్చే ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించ‌టం.. దానికి పెద్ద ఎత్తున సానుకూల‌త వ్య‌క్తం కావ‌టం తెలిసిందే. రైతుల్ని ఓటు బ్యాంకుగా మారుస్తూ కేసీఆర్ రూపొందించిన ప‌థ‌కం.. అంత పెద్ద మోడీని సైతం క‌ద‌లించ‌ట‌మే కాదు.. చివ‌ర‌కు ఆయ‌న ప‌థ‌కాన్ని కాపీ కొట్టేయ‌టం తెలిసిందే.

ఇలా కొన్ని వ‌ర్గాల వారికి కొన్ని ప‌థ‌కాల కింద నేరుగా డ‌బ్బులు అందించే తీరు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. ఇలాంటివేళ‌.. తాజాగా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఒక భారీ సంక్షేమ ప‌థ‌కాన్ని కాంగ్రెస్ ప్ర‌క‌టించింది.

పేద‌రికంపై చివ‌రి స‌మ‌రం పేరుతో ప్ర‌క‌టించిన ఈ ప‌థ‌కం పేరు కాస్త నోరు తిర‌గ‌ని రీతిలో ఉంది. సామాన్యుల నోళ్ల‌ల్లో  తేలిగా నానేలా లేని ఈ ప‌థ‌కం పేరును న్యూన‌త‌మ్ ఆయ్ యోజ‌నాగా రాహుల్ ప్ర‌క‌టించారు. సింఫుల్ గా చెప్పాలంటే ఎన్ వైఏవైగా ఆయ‌న చెప్పారు. పేద‌ల‌కు న్యాయం చేయ‌టం కోసం చేస్తున్న చ‌రిత్రాత్మ‌క చ‌ర్య‌గా ఆయ‌న దీన్ని అభివ‌ర్ణించారు. ఇంత‌కూ ఈ ప‌థ‌కం ఏమిటి?  అదెలా అమ‌లు చేస్తారు? ఈ ప‌థ‌కం కోసం ప్ర‌భుత్వ ఖ‌జానా మీద ప‌డే భారం ఎంత‌?  అన్న‌ది చూస్తే.. నోట మాట రాని ప‌రిస్థితి.

ముందుగా.. రాహుల్ ప్ర‌క‌టించిన ఈ భారీ సంక్షేమ ప‌థ‌కం అమ‌లు ఎలా జ‌రుగుతుందో రాహుల్ మాట‌ల్లో చూస్తే. దేశంలో పేద కుటుంబాలు సుమారుగా 25 కోట్ల వ‌ర‌కూ ఉన్నాయి. ఇలాంటి కుటుంబాల‌కు ఏడాదికి రూ.72వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించ‌ట‌మే ల‌క్ష్యంగా చెబుతున్నారు. ఈ ప‌థ‌కంతో దేశంలోని 20 శాతం కుటుంబాల‌కు మేలు జ‌రుగుతుందంటున్నారు.

నేరుగా ల‌బ్థిదారు కుటుంబాల‌కు చెందిన బ్యాంకు ఖాతాలో జ‌మ చేయ‌టం ఈ ప‌థ‌కం లక్ష్యం. అయితే.. అన్ని కుటుంబాల‌కు నెల‌కు రూ.6వేల చొప్పున కాకుండా చిన్న లింకు పెట్టారు. దీని ప్ర‌కారం.. ఒక కుటుంబం నెల‌కు రూ.6వేల సంపాద‌నే ఉంద‌నుకుంటే.. వారికి నెల‌కు రూ.6వేల చొప్పున బ్యాంకుఖాతాలో డ‌బ్బులు వేస్తారు. ఒక‌వేళ‌.. ఒక కుటుంబం రూ.4వేలే సంపాదిస్తుంటే వారికి రూ.8వేలు వేస్తారు. అంటే.. ప్ర‌తి కుటుంబానికి రూ.6వేల చొప్పున కాకుండా.. ప్ర‌తి పేద కుటుంబం నెల‌కు రూ.12వేల సంపాద‌న త‌గ్గ‌ని రీతిలో ఈ ప‌థ‌కాన్ని ప్లాన్ చేశారు.

ఈ ప‌థ‌కం కోసం అయ్యే ఖ‌ర్చు ఏడాదికి రూ.3.60 ల‌క్ష‌ల కోట్లుగా లెక్క వేస్తున్నారు. భార‌త్ లోని 20 శాతం నిరుపేదల‌కు ఏడాదికి రూ.72వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాకే నేరుగా జ‌మ చేసే ఈ ప‌థ‌కంతో లాభం సంగ‌తి త‌ర్వాత‌.. ఎంత ప‌క్క‌దారి ప‌డుతుంద‌న్న‌ది స‌మ‌స్య‌. త‌క్కువ సంపాదించే వారికి అందిస్తున్న ఈ ప‌థ‌కం పేద‌ల‌కు మంచే జ‌రుగుతుంద‌నుకుందాం. మ‌రి.. క‌ష్ట‌ప‌డి నెల‌కు రూ.12వేలు సంపాదించే వారికి ఎలాంటి ప్ర‌భుత్వ ద‌న్ను లేక‌పోవ‌టం ఏం న్యాయం. ఒక భార్య‌.. భ‌ర్త ఇద్ద‌రూ నెల‌కు క‌ష్ట‌ప‌డి రూ.12 సంపాదిస్తే అలాంటి వారికి ఈ ప‌థ‌కంలో ల‌బ్థిదారులు కాలేరు. ఇలా చూసిన‌ప్పుడు ఎంత త‌క్కువ సంపాదిస్తే అంత హాయిగా డ‌బ్బులు వ‌స్తాయ‌న్న భావ‌న దేశ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నట్లు?  డ‌బ్బుల‌తో సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేసే బ‌దులు.. వ‌స్తు రూపంలో అందిస్తే అంతో ఇంతో ప్ర‌యోజ‌నం కదా? ఈ విష‌యాన్ని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు ఎందుకు మిస్ అవుతున్న‌ట్లు..?
Tags:    

Similar News