అవిశ్వాసం అంటే మోడీకి భయమెందుకు?

Update: 2018-03-26 06:33 GMT
ఏపీలోని ప‌రిణామ‌ల నేప‌థ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భ‌య‌ప‌డుతున్నార‌ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు. ఏపీలోని అధికార టీడీపీ - ప్ర‌తిప‌క్ష వైసీపీ సంధిస్తున్న అవిశ్వాస అస్త్రాల‌తో కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి అవిశ్వాస భయం పట్టుకుందని రాహుల్ అన్నారు. గత రెండు వారాలుగా పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరగకపోవడానికి అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపకపోవడమే అని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపడానికి ప్రభుత్వం జంకుతోందని.. అందుకే సభ ఆర్డర్‌ లో లేదని వాయిదాలు వేస్తున్నారని చెప్పుకొచ్చారు.

కర్నాటకలోని మైసూర్‌ లో పర్యటించిన రాహుల్‌ గాంధీ భారత్‌ చుట్టుపక్కల దేశాలైన నేపాల్‌ - శ్రీలంక - బర్మా - మాల్దివులు ఒకప్పుడు మన దేశానికి మిత్రులుగా ఉంటే.. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఆ దేశాలన్నీ చైనాకు మిత్రదేశాలుగా మారిపోయాయని విమర్శించారు. భూటాన్‌ భూభాగంలో చైనా రొడ్డు - హెలీప్యాడ్‌ నిర్మించి.. భద్రతా బలగాలను మొహరింప జేసినా ఒక్కరూ కూడా ప్రశ్నించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని మండిపడ్డారు.

కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జమ్ము కాశ్మీర్‌ లో ఉగ్రవాదుల ఆట కట్టించామని.. అప్పట్లో ఆ రాష్ట్రంలో జవాన్లు గానీ - ప్రజలు కానీ ప్రాణాలు పోగొట్టుకున్న దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. కానీ ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో - మెహబూబాముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ ప్రభుత్వం కాశ్మీర్‌ లో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ రోజు ఎక్కడో ఓ చోట హింస జరుగుతూనే ఉందని అన్నారు. కర్నాటక అసెంబ్లి ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమన్న రాహుల్‌..2019 సాధారణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ లోక్‌ సభ స్థానాలను కైవశం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ బీజేపీకి గట్టిపోటీ ఇస్తుందని..మోడీజీకి రైతుల సంక్షేమం పట్టదని విమర్శించారు.
Tags:    

Similar News