కోర్టుకు వెళ‌తా కానీ సారీ చెప్ప‌నంటున్న రాహుల్‌

Update: 2015-11-27 07:00 GMT
రాజ‌కీయ నాయ‌కులు అన్న త‌ర్వాత స‌వాల‌క్ష అంశాల మీద మాట్లాడాల్సి ఉంటుంది. చాలా మాట‌లు చెప్పే క్ర‌మంలో భావోద్వేగాల‌కు గురై ఒక్కోసారి నోరు జారుతుంటారు. ఇలా జారిన స‌మ‌యంలో.. త‌మ కార‌ణంగా జ‌రిగిన త‌ప్పును స‌రిదిద్దుకోవ‌టం.. లేదంటే హుందాగా త‌ప్పును ఒప్పుకోవ‌టం లాంటివి ఒక‌ప్ప‌టి రాజ‌కీయాలు. మారిన రాజ‌కీయాల్లో ఇలాంటివి మ‌చ్చుకు క‌నిపించ‌వు.

గ‌ల్లీ నేత‌లు మొద‌లు ఢిల్లీ నేత‌ల వ‌ర‌కూ ఇదే తీరు. ఇలాంటి తీరుకు తానేమీ మిన‌హాయింపు కాద‌ని నిరూపించారు కాంగ్రెస్ యువ‌రాజు రాహుల్ గాంధీ. ఆ మ‌ధ్యన ఆర్ ఎస్ ఎస్ ను ఉద్దేశించి ఒక వివాదాస్ప‌ద వ్యాఖ్య చేశారు. గాంధీ మ‌హాత్ముడి హ‌త్య‌కు ఆర్ ఎస్ ఎస్ కార‌ణ‌మ‌న‌టం.. దీనిపై సంఘ్ అగ్ర‌హం చేసి.. రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేసింది. లేని ప‌క్షంలో అత‌డిపై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించింది.

అయితే.. సంఘ్ హెచ్చ‌రిక‌ల్ని రాహుల్ డోన్ట్ కేర్ అంటున్నారు. కావాలంటే.. తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం కానీ.. సారీ చెప్పేది మాత్రం లేద‌ని తేల్చి చెబుతున్నారు. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై మ‌హారాష్ట్రలోని బివాండీ జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో సంఘ్ నేత‌లు పిటీష‌న్ వేయ‌గా.. విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ రాహుల్ కు నోటీసులు పంపారు. తాను కోర్టు వాయిదాల‌కు వెళ‌తాను కానీ.. సంఘ్ మీద తాను చేసిన వ్యాఖ్య‌కు మాత్రం సారీ చెప్ప‌నంటున్నారు. మ‌రి.. ఈ వ్య‌వ‌హారం ఎక్క‌డివ‌ర‌కూ వెళుతుందో..? అయినా.. రాహుల్ కు ఇంత మొండిత‌నం ఎందుకు..?
Tags:    

Similar News