మోడీకి పైసా పంచ్ వేసిన రాహుల్‌

Update: 2018-05-30 11:21 GMT
కొన్నిసార్లు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా అనుకున్న‌వేమీ జ‌ర‌గ‌వు. అందుకు భిన్నంగా కొన్ని సంద‌ర్భాల్లో కాలం భ‌లేగా క‌లిసి వ‌స్తుంటుంది. తాజాగా అలాంటి ప‌రిస్థితే కాంగ్రెస్ పార్టీకి ఉంద‌ని చెప్పాలి. మోడీపై ధ్వ‌జ‌మెత్తేందుకు.. ఆయ‌న‌ కున్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు చేతికి వ‌చ్చిన అవ‌కాశాల్ని కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ స‌రిగా వినియోగించుకోలేక‌పోతున్న‌ట్లుగా కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు

అలాంటి వాద‌న త‌ప్ప‌ని.. తాను చాలా యాక్టివ్ గా ఉన్నాన‌ని.. మోడీ మీద ఏ చిన్న అవ‌కాశం లభించినా చెల‌రేగిపోవ‌టానికి తాను సిద్ధంగా ఉన్న వైనాన్ని తాజాగా చేసిన ట్వీట్ లో స్ప‌ష్టం చేశారు రాహుల్ గాంధీ. గ‌డిచిన 16 రోజులుగా అదే ప‌నిగా పెరుగుతున్న డీజిల్.. పెట్రోల్ ధ‌ర‌లు ఈ రోజు త‌గ్గిన‌ట్లుగా వార్త‌లు రావ‌టం తెలిసిందే.

అయితే.. ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లు కాకుండా.. లీట‌రు పెట్రోల్‌.. డీజిల్ మీద కేవ‌లం ఒక పైసా మాత్ర‌మే త‌గ్గిన‌ట్లుగా ఆయిల్  కంపెనీలు ప్ర‌క‌టించాయి. దీనిపై ఆన్ లైన్ లోనూ.. ఆఫ్ లైన్ లోనూ భారీ చ‌ర్చ జ‌ర‌గ‌ట‌మే కాదు.. మోడీ స‌ర్కారు తీరును తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

ఇలాంటి వేళ‌.. పైసా త‌గ్గింపుపై తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌డుతూ రాహుల్ గాంధీ ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. పైసా త‌గ్గించ‌టం ఏమిటంటూ మండిప‌డ్డ ఆయ‌న‌.. వాహ‌న‌దారుల్ని వేళాకోళం చేసిన‌ట్లుగా తాజా త‌గ్గింపు ఉందంటూ ట్వీట్ చేశారు. ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి రాహుల్ చేసిన ట్వీట్ చూస్తే.. ఇవాళ పెట్రోల్‌.. డీజిల్ పై ఒక పైసా త‌గ్గించారు. ఇదేం త‌గ్గింపు?  ఒక‌పైసా త‌గ్గించ‌టం ఏమిటి? అంటూ ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల‌ను వేళాకోళం చేయ‌ట‌మే మీ ఉద్దేశ‌మైతే ఇది పిల్ల చేష్ట‌గా అభివ‌ర్ణించిన రాహుల్‌.. తాను పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల త‌గ్గింపుపై స‌వాలు విసిరాన‌ని..కానీ.. తాను విసిరిన ఛాలెంజ్‌ కు ఇది ఏమాత్రం స‌రైన స్పంద‌న కాదంటూ గురి చూసిన‌ట్లుగా పంచ్ వేశారు. పెంచితే కూడా ఇంత రచ్చ అయ్యేది కాదు కానీ పైసా త‌గ్గించ‌టం మాత్రం పుండు మీద కారం జ‌ల్లిన‌ట్లుగా ఉంద‌ని చెప్పాలి. మ‌రి.. దీనిపై మోడీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News