కరోనా సంక్షోభంలో పలావ్ వండిన మోడీ ప్రభుత్వం .. రాహుల్ గాంధీ విసుర్లు !

Update: 2020-09-16 10:10 GMT
కరోనా వైరస్ సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రతిపక్ష నేతలు ప్రధాని మోడీని టార్గెట్ ‌గా చేసుకుని తరచూ ఆరోపణాస్త్రాలను సంధిస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ విఫలం అయ్యాయంటూ కాంగ్రెస్ సహా 22 ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఈ సారి సెటైర్లతో చెలరేగిపోయారు. కరోనా సంక్షోభ సమయంలో బీజేపీ ప్రభుత్వం మాంఛి పలావ్ వండుతూ కాలక్షేపం చేసిందని రాహుల్ గాంధీ విమర్శలు కురిపించారు.

21 రోజుల్లోనే కరోనా వైరస్‌ పై విజయం సాధిస్తామని మోడీ సర్కార్ బీరాలు పలికిందని మండిపడ్డారు. ఆరోగ్య సేతు యాప్‌ కు కేంద్రప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ ‌గా మారిందని ఎద్దేవా చేశారు. ఆరోగ్యసేతు యాప్‌తో దేశ ప్రజలకు కరోనా నుంచి భద్రత కల్పించామని చెప్పడం అబద్దం అని , కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేసిన లాక్‌డౌన్ వల్ల తలెత్తిన సంక్షోభాన్ని నివారించడానికి 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిందని, అది ఎవరికి చెరిందోో ఇప్పటికీ అర్థం కావట్లేదని రాహుల్ గాంధీ అన్నారు.

లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఎలాంటి చొరబాట్లూ చోటు చేసుకోలేదంటూ అబద్ధాలను వండి వార్చిందని మండిపడ్డారు. రాజకీయ వార్తల కోసం సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయంటూ దేశ ప్రజలకు మాయమాటలు చెప్పిందని ధ్వజమెత్తారు. కరోనా సంక్షోభ సమయంలోనూ అవకాశవాద రాజకీయాలను మోడీ ప్రభుత్వం వెదుక్కుందని విమర్శించారు. కరోనా ఆపదలో పీఎం కేర్స్ రూపంలో మోడీ ప్రభుత్వం తన అవసరాలను తీర్చుకుందని అన్నారు. పీఎం కేర్స్ నిధుల మంజూరులో అవకతవకలు, అవినీతి చోటు చేసుకుందనే విషయాన్ని రాహుల్ గాంధీ పరోక్షంగా విమర్శలు చేశారు.
Tags:    

Similar News