రాహుల్ అధ్యక్షుడైన తరువాత ఎన్నికల్లో ఏం సాధించారు?

Update: 2018-07-24 01:30 GMT
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఖరారు చేస్తూ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికలకు పార్టీని ఆయనే నడిపిస్తారని.. పొత్తుల విషయంలోనూ ఆయన నిర్ణయమే ఫైనల్ అని తేల్చేశారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో 200 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. అయితే.. థింక్ బిగ్ ఫ్యాక్టర్ మర్చిపోయి నిర్దేశించుకున్న ఈ లక్ష్యం పార్టీ లీడర్లు - క్యాడర్‌ లో ఊపు తేకపోగా నాయకత్వంలో స్థైర్యం - ఆత్మవిశ్వాసం కొరవడిందన్న సంకేతాలను ఇప్పటికే పంపించింది.

ఇదంతా పక్కన పెడితే అధికారికంగా కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి అనిపించుకున్న రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో పార్టీ ఎలా పెర్ఫార్మ్ చేసిందన్నది చూస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి.

గత ఏడాది డిసెంబరు 16న రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. ఆయన దక్షతను కొలవడానికి ఏడు నెలల కాలమన్నది చాలా తక్కువే కానీ... డిసెంబరు 16కి ముందు ఆయన అధ్యక్షుడు కాకపోయినా అంతా తానే అయి నడిపించారన్న సంగతీ గుర్తుచేసుకోవాలి.

రాహుల్ గాంధీ 2017 డిసెంబరు 16న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన తరువాత 6 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలొచ్చాయి. రెండు రాష్ట్రాల్లో పోలింగ్ రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడానికి ముందే జరగ్గా.. 4 రాష్ట్రాల్లో మాత్రం మొత్తం ఎలక్షన్ షెడ్యూలంతా రాహుల్ పగ్గాలు చేపట్టాక జరిగిందే.

ఈ 6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 590 స్థానాల్లో పోటీ చేయగా 199 స్థానాల్లో గెలిచింది.

గుజరాత్ :

ఆయన అధ్యక్షుడు అయిన వెంటనే గుజరాత్ ఎన్నికల ఫలితాలొచ్చాయి. అక్కడ పోలింగ్ - ప్రచారం ఆయన అధ్యక్షుడు కావడానికి కొద్ది రోజుల ముందు జరిగాయి. గుజరాత్‌ లో కాలికి బలపం కట్టుకుని గుళ్లూగోపురాలు తిరిగిన రాహుల్ ఆ రాష్ట్ర ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఫలితాలకు రెండు రోజుల ముందే ఆయన్ను అధికారికంగా అధ్యక్షుడిగా ప్రకటించడంతో పార్టీలోనూ ఎక్కడలేని ఉత్సాహం కనిపించింది. కానీ... గుజరాత్‌ ఫలితాలు మాత్రం రాహుల్‌కు నీరసమే మిగిల్చాయి.

182 సీట్లున్న గుజరాత్‌ లో కాంగ్రెస్ పార్టీ 162 సీట్లకు పోటీ చేసింది. 77 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఈసారైనా గుజరాత్‌ లో అధికారం చేపట్టాలన్న కాంగ్రెస్ కోరిక తీరలేదు.

హిమాచల్ ప్రదేశ్:

68 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఆయన అధ్యక్షుడు అయిన రెండు రోజుల్లోనే వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్‌ లోనూ రాహుల్ భారీ ఎత్తున ప్రచారం చేశారు. ఆ రాష్ట్రంలో ఇంకే పార్టీతో సీట్ల సర్దుబాటు లేకపోవడంతో అన్ని స్థానాలకూ పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 21 చోట్ల మాత్రమే గెలిచింది. దీంతో అక్కడ అధికారం కోల్పోయింది.

నాగాలాండ్:

60 సీట్లున్న నాగాలాండ్ అసెంబ్లీకి 2018 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో 18 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. దీంతో నాగాలాండ్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం కనుమరుగైంది.

త్రిపుర:

త్రిపుర కూడా 60 అసెంబ్లీ సీట్లున్న చిన్న రాష్ట్రం. ఇక్కడ ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో 59 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. కానీ - ఒక్క స్థానంలోనైనా ఆ పార్టీకి గెలుపు దక్కలేదు.

మేఘాలయ:

ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రమిది. నాగాలాండ్ - త్రిపురలతో పాటే మేఘాలయాకూ ఎన్నికలు జరిగాయి. 60 సీట్లున్న ఈ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 59 చోట్ల పోటీ చేసింది. 21 స్థానాల్లో గెలిచింది. అధికారం కోల్పోయింది.

కర్ణాటక:

ఈ ఏడాది మే 12న కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. 224 స్థానాలున్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్లా పోటీ చేసింది. 80 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా గెలిచింది. బీజేపీ మొత్తం 104 స్థానాల్లో గెలిచింది. కానీ.. 37 సీట్లు గెలుచుకున్న జనతాదళ్(సెక్యులర్) పార్టీతో కాంగ్రెస్ జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. ముఖ్యమంత్రిగా జనతాదళ్(సెక్యులర్) నేత కుమారస్వామిని ఎన్నుకున్నారు.
దీంతో.. కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకున్నా ముఖ్యమంత్రి పదవి మాత్రం కోల్పోయినట్లయింది.


Tags:    

Similar News